Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఫైటర్ జెట్లను కూల్చాము. భారత్ మా దెబ్బకు వణికిపోయింది.’’ అని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ అసలు భయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. భారత దాడులకు భయపడిన పాకిస్తాన్, అమెరికాను కాపాడాలని వేడుకున్నట్లు తెలుస్తోంది. తమ వైమానిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ విరుచుకుపడిన తర్వాత పాకిస్తాన్ సాయం కోసం అమెరికాకు పరిగెత్తిందని అమెరికా ప్రభుత్వ పత్రాలు తెలియజేస్తున్నాయి.
యూఎస్ ఫారిన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FARA) కింద దాఖలు చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం, ఆపరేషన్ సిందూర్‌ను కేవలం భారత్ తాత్కాలికంగా నిలిపేసిందని, మళ్లీ తమపై దాడులు ప్రారంభమవుతాయని పాకిస్తాన్ ఆందోళన చెందినట్లు ఈ డాక్యుమెంట్లు రుజువు చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడి 26 మంది అమాయకులను చంపిన తర్వాత, భారత్ ఆపరేషన్ సిందూర్ ద్వారా సమాధానం ఇచ్చింది. పీఓకే, పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు వందలాది మంది చనిపోయారు.
దీని తర్వాత, భారత్‌పైకి పాకిస్తాన్ మిలిటరీ దాడికి పాల్పడేందుకు ప్రయత్నించిన తర్వాత, భారత్ పాకిస్తాన్‌లోని దాని ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 11 ఎయిర్ బేస్‌లపై విరుచుకుపడింది. ముఖ్యంగా, పాక్ సైన్యం హెడ్ క్వార్టర్స్ అయిన రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ నాయకత్వం వణికిపోయింది.
ఆ సమయంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ నిలిపివేశామని, మళ్లీ పాక్ దాడులు చేస్తే తిరిగి ప్రారంభమవుతుందని హెచ్చరించిన నేపథ్యంలో, పాకిస్తాన్ ఆందోళన చెందినట్లు పాక్ తరుపున అమెరికాలో లాబీయింగ్ చేసే సంస్థ స్కైర్ పాటన్ బోగ్స్ పత్రాలు తెలియజేశాయి. ఆపరేషన్ సమయంలో భారత్ కాల్పుల విరమణ కోరిందని పాక్ చేసిన వాదనలన్నీ తప్పని తేలింది. భారత్ మళ్లీ దాడి చేస్తుందనే భయంతో, పాక్ ట్రంప్‌ను ఆశ్రయించినట్లు తేలింది.
