Site icon NTV Telugu

Pakistan: భారత్‌పై యుద్ధానికి సిద్ధమైన పాక్.. దేశాన్ని ఉద్దేశించి పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రసంగం..

Shehbaz Sharif

Shehbaz Sharif

Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, బుధవారం తెల్లవారుజాము ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఒక్కసారిగా పాకిస్తాన్ షాక్‌కి గురైంది. ఇదిలా ఉంటే, ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు.

Read Also: Scalp, Hammer: “స్కాల్ప్, హామర్‌”లతో పాకిస్తాన్‌లో దీపావళి.. ఈ ఆయుధాలనే భారత్ ఎందుకు వాడింది..?

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక దళాలను కోరింది. భారత సైనిక చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్ భారతీయ దౌత్యవేత్తను పిలిచి, నిరసన తెలియజేసింది. భారత దాడులకు ప్రతీకారం తీర్చుకునే హక్కు పాకిస్తాన్‌కి ఉందని ఆ దేశ సమాచార మంత్రి అతుల్లా తరార్ తీవ్రంగా స్పందించారు.

ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ‘‘కఠినమైన యుద్ధ చర్య’’కు పాల్పడిందని పాక్ ఆరోపించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పాకిస్తాన్ పీఎం షహాబాజ్ షరీఫ్ బుధవారం జాతీయ ప్రసంగానికి ముందు అత్యవసర జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎక్కువ సమయం పట్టదని, ఇప్పటికే సైనిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అన్నారు.

ఇదిలా ఉంటే, భారత ‘‘ఆపరేషన్ సిందూర్’’కి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ సైన్యాన్ని పీఎం షెహబాజ్ షరీఫ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ‘‘రెడ్ అలర్ట్’’ జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో, పాక్ పీఎం ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. దేశ భద్రత, పాక్ ఆర్మీ తీసుకుంటున్న చర్యల్ని ప్రజలకు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version