దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉదృతంగా ఉండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే అర్హులైన అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇప్పటికే దేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద సంఖ్యలో దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. దాదాపుగా ఇప్పటి వరకు దేశంలో 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. ఎంత పెద్ద ఎత్తున వ్యాక్సిన్ లను అందిస్తున్నారో అదే లెవల్లో వ్యాక్సిన్ వృధా అవుతున్నది. దీనిపై కేంద్రం దృష్టి సారించింది. వ్యాక్సిన్ వృధాపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ వృధా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని ఇప్పటికే సూచించారు. ఇక ఇదిలా ఉంటె, ఇప్పటి వరకు దేశంలో 44 లక్షలకు పైగా టీకా డోసులు వృధా అయినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రాలకు 10 కోట్లకు పైగా వ్యాక్సిన్ లను అందించగా అందులో 44 లక్షల డోసులు వృధా అయ్యాయి. తమిళనాడులో అత్యధికంగా 12.10 శాతం వ్యాక్సిన్లు వృధా కాగా, రెండో స్థానంలో హర్యానా, ఆ తరువాత స్థానంలో పంజాబ్, మణిపూర్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో 7.55 శాతం డోసులు వృధా అయినట్టు అధికారులు పేర్కొన్నారు.