PM Modi: రాజస్థాన్ బన్స్వారా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపదని ‘‘చొరబాటుదారులకు’’, ‘‘ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి’’ పంచుతోందని, ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు గానూ ప్రధాని నరేంద్రమోడీపై కఠిన చర్యలు తీసుకోవాలని 17,000 మంది పౌరులు భారత ఎన్నికల కమిషన్ లేఖలు రాశారు.
Read Also: Ranjith Reddy: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రంజిత్ రెడ్డి..
వతన్ కే రహామే మరియు సంవిధాన్ బచావో నాగరిక్ అభియాన్ అనే రెండు పౌర హక్కుల సంఘాల నేతృత్వంలోని 17,000 మంది పౌరులు లేఖపై సంతకం చేశారు. మోడీ ప్రసంగం ‘మత భావాలను’ ఆకర్షించడమే కాకుండా ముస్లింలపై హిందువులలో ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని, కాంగ్రెస్ మేనిఫెస్టోలోని సంపద పున:పంపిణీ హామీపై ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన తల్లులు, సోదరీమణుల బంగారం, చివరకు మంగళసూత్రాలను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన.. ‘‘ఈ దేశంలోని సంపదపై తొలిహక్కు ముస్లింలకే ఉంది’’ అనే వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించారు.
‘‘మీరు కష్టపడి సంపాదించిన డబ్బు అక్రమ వలసదారులకు, చొరబాటుదారులకు ఇవ్వాలా..? అది మీకు ఆమోదయోగ్యమేనా..?’’ అని ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ నిన్న బన్స్వారాలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘వారు మా ఆడవాళ్ల బంగారాన్ని లెక్కపెట్టి లాక్కుంటారు. ఈ అర్బన్ నక్సల్స్ భావజాతం మీ మంగళసూత్రాలను కూడా తీసేస్తుంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ రోజు కూడా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తాను మాట్లాడిన 90 సెకన్ల ప్రసంగం కాంగ్రెస్‌ను భయపెడుతోందని, నిజం చెప్పడంతో కాంగ్రెస్ భయాందోళనలో ఉందని అన్నారు.