Uddhav Thackeray: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ప్రదర్శన చేసింది. కేవలం 09 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. మొత్తం 48 సీట్లలో ఎన్డీయే కూటమి 17 స్థానాలకు పరిమితం కాగా, ప్రతిపక్ష ఇండియా కూటమి 30 స్థానాల్లో గెలిచింది. ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన(యూబీటీ) 09 సీట్లను గెలుచుకుంది. మరోవైపు ఏక్‌నాథ్ షిండే శివసేన 07 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో శివసేన విడిపోకముందు బీజేపీతో కలిసి మహారాష్ట్రలోని అన్ని స్థానాలను దాదాపుగా క్లీన్‌స్వీప్ చేశాయి. కానీ ఈ సారి పరిస్థితి రివర్స్ అయింది.
Read Also: Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసు.. హేమకు ‘మా’ ఊహించని షాక్!
అయితే, ఈ విజయం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి ఎన్డీయే కూటమిలో చేరుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా శివసేన రెండు గ్రూపులు కలిసిపోతాయని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఏక్‌నాథ్ షిండే శివసేన బీజేపీతో ఉండగా, ఉద్దవ్ శివసేన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉంది.
ఈ ఊహాగానాలపై శివసేన(యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేది స్పందించారు. ఈ ఆరోపణలు చేసిన జర్నలిస్టులపై ఆమె విరుచుకుపడ్డారు. బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందని ఊహించారని, అది సాధ్యంకాకపోవడంతో వారు తన పార్టీని, ఇండియా కూటమిని తుడిచిపెట్టడానికి, ఎన్డీయే కూటమిలోకి మళ్లీ చేరుతన్నట్లు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ‘‘మోయే మోమే.. యే న హోయే(ఇది జరగదు), వీరు ఏడవవచ్చు’’ అని పోస్ట్ చేశారు.