Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సందేశ్‌ఖాలీని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై గవర్నర్, మమతా ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. సందేశ్‌ఖాలీ విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన గవర్నర్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు ఈ ఆరోపణల్ని గవర్నర్ కొట్టిపారేశారు.
Read Also: Palestine protest: ఆంక్షలు ఎదుర్కొంటున్న అమెరికా విద్యార్థులకు హౌతీ ఉగ్రవాదుల బిగ్ ఆఫర్….
శుక్రవారం బర్ధమాన్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని సందేశ్‌ఖాలీపై చాలా సందేశాలు ఇచ్చారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అది భూమి సమస్య, దాన్ని మేం పరిస్కరించాం. కానీ నిన్న రాజ్ భవన్‌లో పనిచేస్తున్న ఓ యువతి గవర్నర్ వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఇలాంటి సంఘటనలు చాలా విన్నా కానీ, నిన్న బాధితురాలి కన్నీళ్లు నా గుండెను తాకాయి. సందేశ్‌ఖాలీ గురించి మాట్లాడే గవర్నర్ తన వద్ద పనిచేసే వ్యక్తిపై ఎందుకు ఇలా ప్రవర్తించారు.’’ అని అన్నారు. మహిళ వాంగ్మూల వీడియో తాను చూశానని, బెంగాల్‌లో ఉండీ, రాత్రి రాజ్ భవన్‌లో బస చేసిన ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
రాజ్ భవన్‌లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగి గురువారం గవర్నర్‌పై ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణల్ని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తిరస్కరించారు. తనపై కట్టుకథలుగా కొట్టిపారేవారు. నన్ను ఎవరైనా కించపరడచం ద్వారా ఎన్నికల ప్రయోజనాలు కోరుకుంటే వారిని దేవుడు చూసుకుంటాడని, కానీ బెంగాల్ అవినీతి, హింసపై నా పోరాటాన్ని ఆపనని ఆయన గురువారం అన్నారు. తనపై కొన్ని రాజకీయ శక్తులు ఆరోపణలు చేస్తున్నాయని శుక్రవారం మరోసారి ఆరోపించారు. ఇది సీఎం మమతా బెనర్జీ హేయమైన కుట్రగా బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు.