Palestine protest: అమెరికాలో పలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా యూనివర్సిటీ క్యాంపస్‌లు రణరంగాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు పోలీసులు ఈ నిరసనల్ని అణిచివేస్తున్నారు. ఈ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర సిబ్బందిపై ఆంక్షలు విధిస్తున్నారు. అయితే ఇలా ఆంక్షలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు హౌతీ ఉగ్రవాదులు బిగ్ ఆఫర్ ఇచ్చారు. యూఎస్ విద్యార్థులకు విద్యా అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు.
గాజా వివాదం పలు ఉద్రిక్తతలకు కారణమవుతున్న నేపథ్యంలో హౌలీ ఉగ్రవాదులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘పాలస్తీనాకు మద్దతు ఇచ్చినందుకు యూఎస్ యూనివర్సిటీల నుంచి సస్పెండ్ చేయబడిని విద్యార్థులను మేం స్వాగతిస్తున్నాం. ఈ విషయాన్ని మేం సీరియస్‌గా తీసుకుంటున్నాం’’ అని హౌతీలు నిర్వహిస్తున్న సనా యూనివర్సిటీ అధికారి చెప్పారు. పాలస్తీనాకు మద్దతుగా మేం చేయగలిగినదంతా చేశామని ఆయన అన్నారు. సనా యూనివర్సిటీ అమెరికన్ విద్యార్థుల మానవతా వైఖరిని ప్రశంసించింది. యెమెన్‌లో వారి విద్యను కొనసాగించేందుకు అవకాశం ఇచ్చింది.
Read Also: Karnataka: ప్రియురాలితో పారిపోయిన కొడుకు.. తల్లిని స్తంభానికి కట్టేసి కొట్టారు..
సనా యూనివర్సిటీ బోర్డు అమెరికా, యూరప్ లోని విద్యావేత్తలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న భావప్రకటన స్వేచ్ఛను అణిచివేయడాన్ని ఖండించింది. బాధిత విద్యార్థులు తమను సంప్రదించడానికి ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, కొలంబియా యూనివర్సిటీ ,పోర్ట్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, విస్‌కాన్సిన్ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీల్లో పాలస్తీనా అనుకూల నిరసనలు మిన్నంటాయి. విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నిరసనల్ని పోలీసులు అణిచివేశారు. అమెరికా వ్యాప్తంగా 30 వర్సిటీలు, కళాశాల్లలో 1600 మందికి పైగా నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు.
హమాస్-ఇజ్రాయిల్ మధ్య అక్టోబర్ 7 దాడుల తర్వాత ప్రారంభమైన గాజా యుద్ధంలో హమాస్‌కి హౌతీలు మద్దతు తెలిపారు. యెమెన్‌ని చెందిన ఈ గ్రూపు ఎర్ర సముద్రం ప్రపంచ నౌకా వాణిజ్యానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయిల్, యూకేతో సంబంధం ఉన్న పలు ఓడల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు.