West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..

  • అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా..
  • పోలీసుల సోదాలతో ఉద్రిక్త వాతావరణం..
  • విషయం తెలిసి మేనల్లుడి ఇంటికి మమత పరుగులు..
Mamata Banerjee

Mamata Banerjee

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఇప్పటికే ముక్కలుగా విడిపోయింది. మమతా బెనర్జీకి నమ్మకస్తులే హ్యాండ్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, శనివారం తెల్లవారుజామున కోల్‌కతాలోని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. రాత్రి 2.30 గంటల సమయంలో పోలీసులు అభిషేక్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత కార్యదర్శి సుమిత్ రాయ్‌ని అరెస్ట్ చేయడానికి వెస్ట్ మిడ్నాపూర్ జిల్లా పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. సుమిత్ రాయ్‌పై అక్రమ వసూళ్ల కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

పోలీసులు అభిషేక్ ఇంటికి చేరుకుని సెర్చ్ చేయాలని కోరగా, ఆయన సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. కొంత సేపు వాగ్వాదం తర్వాత పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ విషయం తెలిసిన మాజీ సీఎం, టీఎంసీ అధినేతి మమతా బెనర్జీ హుటాహుటిన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇంటికి పరుగులు పెట్టారు. ఆమె అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం తర్వాత మమత తన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. అయితే, శనివారం ఉదయం ఈ ఘటనపై మీడియా ప్రశ్నించగా అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

×
×
Ad

అభిషేక్ సహాయకుడిపై వచ్చిన ఆరోపణల్ని టీఎంసీ ఖండించింది. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమని ఆరోపించారు. అభిషేక్ బెనర్జీపై ఇప్పటికే రెండు వేర్వేరు కేసుల్లో విచారణ జరుగుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో విద్వేషపూరిత ప్రసంగంపై సీఐడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు సంబంధించిన తీర్మానంపై పలువురు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని కూడా సీఐడీ విచారిస్తోంది. మరోవైపు, టీఎంసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మదన్ మిత్ర నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. మున్సిపల్ నియామక కుంభకోణంలో భాగంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.