Floods: మైచాంగ్ తుఫాను కారణంగా చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. చెన్నై మొత్తం నదిలా మారిపోయింది. రోడ్లు, కాలనీలు నీటిలో మునిగిపోయాయి. గత కొన్నేళ్లుగా తుఫానులు వస్తున్నాయంటే చాలు చెన్నై వణికిపోతోంది. డిసెంబర్ 4, 2023 నాటికి 48 గంటల్లోనే 40 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాత నమోదు కావడం నగరాన్ని ముంచెత్తింది. గతంలో కూడా పలు తుఫాన్ల సమయంలో చెన్నై ఇలాగే వరద గుప్పిట చిక్కుకుంది.
ఒక్క చెన్నై మాత్రమే కాదు భారతదేశంలోని 12 నగరాలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోబోతున్నాయి. 2015లో ఈశాన్య రుతుపవనాల కాలంలో భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం మునిగిపోవడం ఇంకా గుర్తుండే ఉంటుంది. భారీ వర్షపాతం, డ్రైనేజీలు సరిగా లేకపోవడం చెరువులు, నదీ మార్గాలు కబ్జాకు గురికావడం సమస్య తీవ్రతను మరింత పెంచుతోంది.
ఇదిలా ఉంటే వాతావరణ పరిణామాల్లో మార్పు, కాలుష్యం పెరగడం వల్ల మంచు ఫలకలు కరిగిపోవడం మొదలైంది. ఇది ఇలాగే కొనసాగితే సముద్ర నీటిమట్టాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలు, పట్టణాలు తడిచిపెట్టుకుపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు కోల్‌కతా, ముంబై నగరాలు ఈ ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి.
వరల్డ్ బ్యాంక్ గ్రూప్‌కి సంబంధించిన పోట్స్‌డ్యామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ అండ్ క్లైమేట్ అనలిటిక్స్ పరిశోధన ప్రకారం.. ఇండియా భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నందున, ఇతర ప్రాంతాల కన్నా ఈ ప్రాంతంలో సముద్ర మట్టం పెరుగుతుందని హెచ్చరించింది. సముద్రం నీరు రావడం మూలంగా వ్యవసాయం, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది వ్యాధుల పెరుగుదలకు దారి తీయొచ్చని హెచ్చరించింది.
Read Also: Renu Desai: నేను ప్రేమలో పడ్డాను.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్
శతాబ్ధ చివరి నాటికి ప్రమాదంలో 12 నగరాలు:
2021 ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) నివేదికలో భారతదేశానిక భయంకరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ శతాబ్ధం చివరి నాటికి భారతదేశంలోని 12 తీరప్రాంత నగరాలను వరదలు, సముద్రమట్టాలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ముంబై, చెన్నై, కొచ్చి మరియు విశాఖపట్నం సహా డజన్ భారతీయ నగరాలు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఇప్పటికే తీరప్రాంతాల్లో సముద్రకోత పెరుగుతోంది. మత్స్యకార కుటుంబాలు ఆ ప్రభావాన్ని అనుభవిస్తున్నాయి. 2050 నాటికి దాదాపుగా 1500 చదరపు కి.మీ భూభాగం కోల్పోయే అవకాశం ఉందని అంచనా. ఇది తీరప్రాంత ప్రజల ఉనికికే ముప్పుగా మారబోతోంది. మరోవైపు ఢిల్లీ, హిమాలయ రాష్ట్రాల్లో కూడా వరద ముప్పు ప్రమాదం ఉంది. బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో రుతుపవనాల ప్రేరేపిత వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో యమునా నదీ వరదలే ఇందుకు మంచి ఉదాహరణగా ఉంది. జూలై నెలలో యమునా నదిలో 208.48 మీటర్ల ఎత్తుకు నీరు చేరుకుంది.