MK Stalin: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కొన్ని రాష్ట్రాలకే నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు తమిళనాడుని కేంద్ర బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించారని సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. దీనికి నిరసనగా జూలై 27న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆయన మంగళవారం తెలిపారు. బడ్జెట్‌ను తీవ్ర నిరాశకు గురి చేసిందని, అందుకే సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. జూలై 24న బడ్జెట్‌కి నిరసనగా డీఎంకే ఎంపీలు నిరసన తెలపనున్నారు.
తమిళనాడు హక్కుల కోసం ప్రజాకోర్టులో పోరాడుతూనే ఉంటామని సీఎం అన్నారు. మైనారిటీ బీజేపీని, మెజారిటీ బీజేపీగా మార్చిన కొన్ని ప్రాంతీయ పార్టీలను తృప్తి పరిచేందుకు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ కేటాయింపులు చేశారని ఆరోపించారు. బీహార్, ఆంధ్రప్రదేశ్‌లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు మెట్రో రైలు పథకం ప్రకటించినా, దానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని, రాష్ట్రాన్ని నేటికి మోసం చేస్తున్నారని ఎంకే స్టాలిన్ అన్నారు. భవిష్యత్తులో బీహార్, ఏపీలకు కూడా ఇదే గతి పట్టే అవకాశం ఉందని అన్నారు.
నిర్మలా సీతారామన్ వారి ప్రభుత్వాన్ని నిలబెట్టే రాష్ట్రాలకు మినహాయించి అన్ని రాష్ట్రాలను మరిచిపోయారని అన్నారు. తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక పథకాలు లేవని, మా డిమాండ్లను నెరవేర్చలేదని, రాష్ట్ర ప్రజలపై కేంద్రం కోపంతో ఉందని స్టాలిన్ ఆరోపించారు. బడ్జెట్‌లో తమిళనాడు అనే పదాన్ని కూడా ప్రస్తావించలేదని అన్నారు.