Congress On UCC : అన్ని చట్టాల్లోనూ ఏకరూపత అవసరం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దేశంలోని చట్టాలన్నిటిలోనూ ఏకరూపత ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఉమ్మడి పౌర స్మృతి (UCC)పై ముసాయిదా బిల్లును ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత మాత్రమే దానిపై స్పందించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వం, ఆస్తుల పంపకాల్లో మతాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం వర్తించాలని బీజేపీ చెప్తోంది. దీనిని కొన్ని పార్టీలతోపాటు మతపరమైన సంస్థలు, ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
Read also: Panchakarla Ramesh Babu: ఈ నెల 20న సాయంత్రం జనసేనలో చేరుతా..
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతత్వంలో ఆ పార్టీ సీనియర్ నేతలు శనివారం రహస్య సమావేశం నిర్వహించారు. ఓ కాంగ్రెస్ నేత మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, యూసీసీపై అంతర్గతంగా ఓ నివేదికను రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అన్ని చట్టాలు ఏకరూపంగా ఉండవలసిన అవసరం లేదని నిర్ణయించారు. ఈ దేశంలో ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాది.. ముస్లింలు, హిందువులకు ఒకే విధమైన సివిల్ చట్టాలు ఏవిధంగా ఉంటాయని నేతలు ప్రశ్నించారు. వ్యక్తిగత చట్టాల్లో కొన్ని మార్పుల గురించి పరిశీలించవచ్చునని పేర్కొన్నారు. శిరోమణి అకాలీ దళ్ లా కమిషన్‌కు రాసిన లేఖలో యూసీసీని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. యూసీసీకి ఆప్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అదేవిధంగా బీఎస్‌పీ కూడా సానుకూలంగా స్పందించింది. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ యూసీసీని వ్యతిరేకిస్తోంది. సీపీఐ, సీపీఐఎం పార్టీలు కూడా యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి.
Read also: Air services: హైదరాబాద్ టూ అమెరికాకు విమాన సర్వీసులు నడపండి..
యూసీసీపై అభిప్రాయాలను తెలియజేయడానికి లా కమిషన్ ఇచ్చిన గడువు ఈ నెల 14తో ముగియగా.. మరో రెండు వారాలు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 27న భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, యూసీసీ గురించి ప్రస్తావించారు. ఒకే కుటుంబంలో వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు చట్టాలు వర్తించవచ్చునా? అలాంటి కుటుంబం సజావుగా నడుస్తుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యవస్థతో దేశం ఎలా పని చేయగలుగుతుందని అడిగారు. ప్రజలకు ఉమ్మడి హక్కులు ఉండాలని భారత రాజ్యాంగం కూడా చెప్తోందన్నారు. ఆ నేపథ్యంలోనే యూసీసీని ముందుకు తీసుకువచ్చారు.