బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తాజాగా బీహారీయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక సందేశాన్ని విడుదల చేశారు. తానెప్పుడూ కుటుంబం కోసం పని చేయలేదని.. 2005లో ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు బీహార్ ప్రజల కోసం నిజాయితీగా.. కష్టపడి సేవ చేసినట్లుగా వివరించారు.
ఇది కూడా చదవండి: Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు.. భయపడేదిలేదన్న నటుడు
మూడు నిమిషాల వీడియోలో.. 2005లో తొలిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన దగ్గర నుంచి జరిగిన విషయాలను ప్రస్తావించారు. ‘‘నా ప్రియమైన బీహార్ సోదర సోదరీమణులారా.. 2005 నుంచి మీకు సేవ చేయడానికి మీరు నాకు అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో బీహార్‌ను చూసి అవమానం పొందాం. ఆ తర్వాత మేము నిజాయితీగా.. కష్టపడి పనిచేసి మీకు పగలు-రాత్రి సేవ చేశాము.’’ అని గుర్తుచేశారు. మరోసారి అధికారం ఇస్తే.. విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్, తాగునీరు, వ్యవసాయం, యువతకు అవకాశాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ‘‘గత ప్రభుత్వం మహిళల కోసం ఎలాంటి పని చేయలేదు. ఇప్పుడు మేము మహిళలను చాలా బలంగా మార్చాం. మహిళలు ఇకపై ఎవరిపైనా ఆధారపడరు. వారి కుటుంబాలు, పిల్లల కోసం అన్ని పనులు చేయగలరు. మేము మొదటి నుంచి సమాజంలోని అన్ని తరగతులను అభివృద్ధి చేశామని మీకు చెప్పాలనుకుంటున్నాము.’’ అని వివరించారు.
ఇది కూడా చదవండి: JD Vance: భార్య మతంపై జేడీ వాన్స్ మరోసారి కీలక ప్రకటన
‘‘మీరు హిందువు అయినా, ముస్లిం అయినా, అగ్ర కులమైనా, వెనుకబడిన వారైనా, దళితుడైనా, మహాదళితుడైనా.. మేము అందరి కోసం పనిచేశాము. నా కుటుంబం కోసం నేను ఏమీ చేయలేదు.’’ అని తెలిపారు. ‘‘మాకు ఇంకో అవకాశం ఇవ్వండి. దీని తర్వాత మరిన్ని పనులు జరుగుతాయి. దీని వల్ల బీహార్ అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతుంది.’’ అని నితీష్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
బీహార్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఒకరు అధికారం నిలబెట్టుకునేందుకు.. ఇంకొకరు అధికారం కోసం పోరాటం చేస్తున్నారు.
प्रिय प्रदेशवासियो,
आइए मिलकर बनाएं नया बिहार।@NitishKumar #Bihar #NitishKumar #JDU #JanataDalUnited #25Se30FirSeNitish pic.twitter.com/XxTqqVaWTp
— Janata Dal (United) (@Jduonline) November 1, 2025