ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఎన్డీఏ కూటమితో సహా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమైపోయాయి. ఇప్పటికే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు కొన్ని నెలలే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. కేబినెట్ విస్తరణకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రెవెన్యూ మంత్రి పదవికి దిలీప్ జైస్వాల్ బుధవారం రాజీనామా చేశారు. బీహార్‌లో బడ్జెట్ సమావేశాలకు కేవలం రెండు రోజుల ముందు ఈ ప్రకటన వచ్చింది. దీంతో బీహార్‌లో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఒకే వ్యక్తి.. ఒకే పదవి సూత్రంతో మంత్రి పదవి నుంచి వైదొలిగినట్లు దిలీప్ జైస్వాల్ పేర్కొన్నారు. బీజేపీ సూత్రాన్ని అనుసరించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక మంత్రివర్గ విస్తరణ.. నితీష్ కుమార్ హక్కు అన్నారు.
ఇది కూడా చదవండి: Kayadu Lohar : వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న డ్రాగన్ బ్యూటీ
ఇదిలా ఉంటే నితీష్ కుమార్.. మంత్రివర్గ విస్తరణకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో ఐదు లేదా ఆరుగురు మంత్రులు ఉండే అవకాశం ఉందని, కనీసం నలుగురు బీజేపీకి చెందినవారుంటారని వర్గాలు తెలిపాయి. సంజయ్ సరోగి, రాజు సింగ్, అవధేష్ పటేల్, జిబేష్ కుమార్, అనిల్ శర్మ వంటి ఎమ్మెల్యేలకు నితీష్ మంత్రివర్గంలో స్థానం కల్పించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అక్టోబర్ లేదా నవంబర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్డీఏ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్ పేరు ప్రకటించాలని డిమాండ్ పెరుగుతోంది. అయితే దీనికి బీజేపీ సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. దీంతో సీఎం పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. ప్రస్తుతం బీహార్‌లో జేడీయూకి సీట్లు తక్కువగా ఉన్నా… ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారు. ఈసారి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.
ఇది కూడా చదవండి: Vemulawada Temple: రాజన్న మోస్ట్ పవర్ ఫుల్.. దేశ ప్రజలు వేములవాడకి వెళ్లాలనుకుంటున్నారు: బండి సంజయ్