రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో నిన్న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నేడు లోక్ సభలో 2022–2023 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం ద్వారా ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నారు. 2022-23లో 5జీ సేవలను ప్రైవేట్ టెలికాం సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తాయని ఆమె స్పష్టం చేశారు. 2025 కల్లా భారత్ ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ పూర్తవుతుందని, మారుమూల ప్రాంతాల్లో కూడా ఆప్టికల్ ఫైబర్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆమె తెలిపారు.
అన్ని పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ తో అనుసంధానం చేస్తామని, రక్షణ రంగానికి కావాల్సిన వాటిని 68 శాతం దేశీయ పరిశ్రమల నుంచే సమకూర్చుకుంటామన్నారు. రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పిస్తామని, పురుగు మందుల వినియోగం కోసం డ్రోన్ల సహకారం అందిస్తామన్నారు. యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం. ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ. అన్ని మంత్రిత్వ శాఖల్లో కాగిత రహిత వ్యవస్థను తీసుకొస్తామన్నారు. బొగ్గును రసాయనంగా మార్చేందుకు ప్రత్యేక పథకంతో పాటు విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.