ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నారీమణులను వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జేపీ నడ్డా వారసుడిగా తొలిసారి మహిళా అధ్యక్షురాలు అవ్వొచ్చని నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే కమలం పార్టీలో ఇది చారిత్రాత్మక విషయమే అవుతుంది. త్వరలోనే ఉత్కంఠకు ఫుల్‌స్టాప్ పడనుంది.
ఇది కూడా చదవండి: Thammudu : తమ్ముడు ఓవర్శీస్ రివ్యూ..
ఇక బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరినో ఒకరిని అధ్యక్ష పదవి వరించనుంది.
ఇది కూడా చదవండి: D Gukesh: ‘బలహీనమైన ఆటగాడు’ అన్న కార్ల్‌సెన్.. గ్రాండ్ చెస్ టోర్నమెంట్ లో ఓడించిన గుకేష్
నిర్మలా సీతారామన్…
నిర్మలా సీతారామన్‌కు బీజేపీలో అపారమైన అనుభవం ఉంది. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి, రక్షణమంత్రిగా విజయవంతంగా నిర్వర్తించారు. ఈమెకు ఆర్ఎస్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెనే అధ్యక్షురాలు అవ్వొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్. సంతోష్‌లు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో నిర్మలా సీతారామన్ పేరునే చర్చించినట్లు సమాచారం. ఆమెకు పార్టీలో అపారమైన అనుభవం ఉందని.. అలాగే నాయకత్వ సామర్థ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మనే అధ్యక్ష పదవి వరించే సూచనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిర్మలమ్మను నియమిస్తే.. దక్షిణ భారత్‌లో బీజేపీ పుంజుకోవచ్చని భావిస్తున్నారు. అలాగే తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కూడా కలిసొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ కారణాలతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మోడీ సర్కార్ భావిస్తోంది. త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తోంది. నిర్మలమ్మ అయితేనే కరెక్ట్ అని పెద్దలంతా మేథోమథనం చేస్తున్నారు. ఒకవేళ లేదంటే ఆ తర్వాత పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
పురందేశ్వరి..
ఇక బీజేపీ అధ్యక్ష రేసులో పురందేశ్వరి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అలాగే బహు భాషా నాయకురాలు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ ప్రతినిధిగా విదేశాల్లో భారత్ తరపున వాయిస్ వినిపించారు.
వనతి శ్రీనివాసన్
వానతి శ్రీనివాసన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. తమిళనాడుకు చెందిన న్యాయవాది వృత్తి నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగారు. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కోయంబత్తూర్ సౌత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1993లో బీజేపీలో చేరినప్పటి నుంచి… తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు వంటి కీలక పాత్రలను నిర్వహించారు. 2020లో బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా, 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఇలా అనేక బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు.
వాస్తవానికి ప్రస్తుత బీజేపీ చీఫ్ నడ్డా పదవీకాలం జనవరి, 2023లోనే ముగిసింది. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపించడంతో ఆయన పదవీకాలాన్ని జూన్, 2024 వరకు పొడిగించారు. ఈసారి పొడిగించలేదు. ఆయన వారసుడి కోసం హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి ఆ పదవిని మహిళలకు కట్టబెట్టాలని ఆర్ఎస్ఎస్ దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగానే ముగ్గురు ప్రముఖమైన పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.