Pema Khandu: టిబెటన్ బౌద్ధ మతగురువు దలైలామా తరుపరి వారసుడి గురించి చర్చ నడుస్తోంది. ఈ అంశం భారత్, చైనా మధ్య వివాదంగా మారింది. తదుపరి దలైలామా చైనా సార్వభౌమత్వం , చట్టాలకు అనుగుణంగా ఉంటాడని చైనా చెప్పింది. అయితే, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. తదుపరి దలైలామా వారసుడిని, దలైలామా మాత్రమే నిర్ణయించే హక్కు ఉందని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై, ఈ విషయంలో భారత్ దూరంగా ఉండాలని చైనా కోరింది.
ఇదిలా ఉంటే, తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తదుపరి దలైలామా ‘‘ప్రజాస్వామ్య దేశం’’ నుంచి వస్తారని, ఖచ్చితంగా చైనా నుంచి కాదని అన్నారు. అయితే, దలైలామా ఎంపిక చేసే ప్రక్రియ అధికారంలో ఉన్న వ్యక్తి మరణించిన తర్వాత నుంచే ప్రారంభమవుతుంది. 14వ దలైలామా మరో 40 ఏళ్లు జీవించాలని ఆశిస్తున్నానని ఇటీవల అన్నారు.
Read Also: Trump: రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే భారత్‌కు 500 శాతం సుంకాలు విధిస్తాం.. ట్రంప్ హెచ్చరికలు
“వాస్తవానికి, నేను చెప్పినట్లుగా, ఆయన ఆరోగ్యం చాలా బాగుంది. ఈసారి కూడా – ఆయన 90వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా – ఆయన 130 సంవత్సరాల వయస్సు వరకు జీవిస్తారని ఆయన అన్నారు. కాబట్టి మనమందరం ప్రార్థిస్తున్నాము మరియు ఆయన 130 సంవత్సరాల వయస్సు వరకు జీవిస్తారని నేను చాలా ఆశిస్తున్నాను” ఖండూ అన్నారు. “15వ దలైలామా కోసం అన్వేషణ… ప్రస్తుత దలైలామా మరణించిన తర్వాతే మొత్తం ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి ఇందులో తొందరపడాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.
దలైలామా వారసత్వంపై చైనా ఎందుకు అభ్యంతరం తెలుపుతుందో తనకు అర్థం కావడం లేదని, ఇది టిబెట్ బౌద్ధలచే గుర్తించబడిందని, దీంతో చైనాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దలైలామా సంస్థ 600 ఏళ్లుగా కొనసాగుతోందని చెప్పారు.