కేరళలో కొత్త రకం వైరస్ అక్కడి ప్రజలను కంగారెత్తి్స్తోంది. కేరళలోని పలు జిల్లాల్లో ఇటీవల టమాటో ఫ్లూ అనే వైరస్ వెలుగుచూసింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో ఈ వైరస్‌ను అధికారులు గుర్తించారు. ఈ వైరస్ కారణంగా చిన్నారులు డీ హైడ్రేషన్, దగ్గు, జలుబు, డయేరియా, చర్మంపై ఎర్రగా దద్దుర్లు రావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. చర్మంపై టమాటో ఆకారంలో బొబ్బలు వస్తుండటంతో దీనికి టమాటా ఫ్లూ అని పేరు పెట్టారు. ఇప్పటికే కొల్లం ప్రాంతంలో 80 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు అధికారులు చెప్తున్నారు.
అయితే టమాటో ఫ్లూ వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ బారిన పడితే కాచి చల్లార్చిన నీరు తాగాలని, చర్మంపై బొబ్బలు వస్తే ఆశ్రద్ధ చేయవద్దని, ఫ్లూ బారిన పడిన వారికి దూరంగా ఉండటం వంటివి పాటించాలని చెప్తున్నారు. ప్రస్తుతం కేరళలోని కొల్లాంకే పరిమితమైన ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని కేరళ ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కేరళలో ఈ ఫ్లూ వెలుగు చూడడంతో పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం అప్రమత్తమైంది. కేరళ నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లోనే తమిళనాడు అధికారులు పరీక్షలు చేస్తున్నారు.