ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించాలనే నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం నిలబడాల్సిన ప్రయాణీకుల కోసం విమానాశ్రయంలో కుర్చీలను వరుసగా హోల్డింగ్ ఏరియాలలో ఏర్పాటు చేశారు.
ఇక ఇటీవల దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ అని తేలిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం అంతర్జాతీయంగా వచ్చేవారిని పరీక్షించడానికి నిబంధనలు విధించింది. నేటి నుంచి యూరప్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ నుండి వచ్చే వారందరికీ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒమ్రికాన్ వేరియంట్ దృష్ట్యా ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు అంతర్జాతీయ ప్రయాణికులందరికీ ఏడు రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేశాయి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదాన్ని గుర్తించి, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్షలను వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రి కార్యదర్శి మంగళవారం నిర్వహించిన సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సూచించారు.