New Parliament: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం అయింది. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ ప్రారంభం కాబోతోంది. కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. 25 పార్టీలు ఈ కార్యక్రమానికి వస్తున్నట్లు తెలిపాయి.
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే.. ఇతర విశేషాలు..
* ఉదయం 7.30 గంటలకు పార్లమెంట్ భవనం ప్రాగణంలో పూజతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రధాని మోడి, లోకసభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకర్ తదితరులు దీంట్లో పాల్గొంటారు.
* సరిగ్గా ఉదయం 8.35 గంటలకు నూతన పార్లమెంట్ భవనంలోని “లోకసభ ఛాంబర్” లోకి అడుగిడనున్న ప్రధాని మోడి.
* “లోకసభ ఛాంబర్” లో ఉదయం 8.35 గంటల నుంచి 9 గంటల మధ్య “అధికారానికి, అధికార మార్పిడి” కి చిహ్నమైన “సెన్ గోల్” ( రాజ దండం) స్థాపన కార్యక్రమం.
* నూతన పార్లమెంట్ భవనంలోని లోకసభ స్పీకర్ ఆసనం పక్కన అద్దాల పెట్టెలో చారిత్రాత్మక “సెన్ గోల్” ను ఉంచనున్న ప్రధాని మోడి.
* నాదస్వరం, మంగళవాయిద్యాలు, తమిళనాడు నుంచి ప్రత్యేకంగా వచ్చిన దేవాలయ గాయక కళాకారులు ఆలపించే “కోలారు పడిగం” కీర్తనల మధ్య “సెన్ గోల్”ను ( రాజ దండం) లోకసభ స్పీకర్ ఆసనానికి సమీపంలో స్థాపించనున్న ప్రధాని మోడి.
* 1947 లో ఆంగ్లేయుల నుంచి భారతీయలకు అధికార మార్పును పురస్కరించుకుని దేశ తొలి ప్రధాని నెహ్రూ కు తమిళనాడు లో ప్రత్యేకంగా తయారుచేసిన “సెన్ గోల్” ను ఇవ్వడం జరిగింది.
* అధికార మార్పిడికి చిహ్నంగా భారత స్వాతంత్రం సందర్భంగా దేశ తొలి ప్రధాని నెహ్రూకు “సెన్ గోల్” (రాజ దండం) ను లార్డ్ మౌంట్ బాటన్ అందజేసిన చారిత్రాత్మక నేపధ్యం ఉంది.
* బంగారు రేకు తాపడంతో తయారుచేసిన సుమారు 5 అడుగులు ఎత్తుగల “రాజ దండం”, పై భాగంలో “నంది ప్రతిమ” తో అధికార దర్పానికి చిహ్నంగా, సంప్రదాయంగా తమిళ భాషలో “సెన్ గోల్” అని అంటారు.
* రాజ్యాభిషేకం సందర్భంగా, అధికార మార్పిడికి చిహ్మంగా రాజు కు “రాజ దండం”ను అందజేసే సంప్రదాయాన్ని చోళ రాజులతో పాటు, దక్షిణ భారత దేశంలోని ఇతర పాలకులు కూడా పాటించారు.
* తమిళనాడులోని “అధీనముల”కు అగ్రకుల ఆధిపత్యాన్ని అడ్డుకోవడంతో పాటు, మతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళిన వందల ఏళ్ళ చరిత్ర ఉంది.
* భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ సరికొత్త శకం ప్రారంభానికి గుర్తుగా “సెన్ గోల్” స్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాల సమాచారం.
* తమిళనాడు లోని శైవ మఠాలకు చెందిన “అధీనములు” (పూజారులు), చారిత్రాత్మక “సెన్ గోల్” ను తయారు చేసిన “ఉమ్మడి బంగారు జ్యూవలర్స్” వారిని, భవన నిర్మాణం చేసిన వారిని సత్కరించనున్న ప్రధాని మోడి.
* ఆ తరువాత, ఉదయం 9.30 గంటలకు నిర్వహించే ప్రార్ధనా సమావేశంలో పాల్గొననున్న శంకరాచార్యులు, విద్యావేత్తలు, వేదపండితులు, సాధువులు.
* సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు జాతీయ గీతాలాపనతో రెండవ విడత కార్యక్రమం ప్రారంభం.
* రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనకర్ స్వాగతోపన్యాసం.
* ఈసందర్భంగా రెండు “షార్ట్ ఫిల్మ్స్” ( లఘు చిత్రాలు) ప్రదర్శన.
* రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పంపిన సందేశాలు చదివి వినిపించే కార్యక్రమం.
* కార్యక్రమానికి హాజరైన సభికులను ఉద్దేశించి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 38 నిముషాలకు ప్రసంగించనున్న రాజ్యసభ లో ప్రతిపక్ష నాయకుడు గా ఉన్న మల్లిఖార్జున ఖర్గే.
* ఆ తర్వాత, లోకసభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం.
* ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని సరిగ్గా ఈరోజు మధ్యాహ్నం 1.05 గంటలకు 75 రూపాయల “స్మారక నాణెం”, “పోస్టల్ స్టాంప్” విడుదల.
* చివరిగా, మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడి ప్రసంగం.
* అంతిమంగా, లోకసభ సెక్రటరీ జనరల్ ఉత్తమ్ కుమార్ ప్రసంగంతో ముగియనున్న కార్యక్రమం.