Nepal: నేపాల్‌లో భారత సరిహద్దుల్లో మతహింస చెలరేగింది. మతపరమైన కంటెంట్‌తో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. నేపాల్‌లోని పర్సా జిల్లాలోని బిర్గుంజ్ పట్టణంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. బీహార్ లోన రక్సౌల్ జిల్లాను ఆనుకుని ఉన్న బిర్గుంజ్ నగరంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. అయినప్పటికీ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలతో భారత్ తన సరిహద్దుల్ని మూసేసింది.
Read Also: Vijay: ఎన్నికల ముందు విజయ్‌కు షాక్.. కరూర్ ఘటనలో సీబీఐ నోటీసులు
ధనుషా జిల్లాలోని కమలా మునిసిపాలిటీకి చెందిన హైదర్ అన్సారీ, అమానత్ అన్సారీగా గుర్తించబడిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు వేరే మత వర్గాలను అవమానించే వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసిన తర్వాత నేపాల్‌లో ఉద్రిక్తత మొదలైంది. ఈ వీడియో పర్సా, ధనుషా జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తల్ని పెంచాయి. ఇద్దర్ని స్థానికులు పోలీసులకు అప్పగించినప్పటికీ, కమలాలోని సుఖువా మారన్ ప్రాంతంలోని ఒక మసీదు ధ్వంసమైంది. ఇది మత ఉద్రిక్తతల్ని మరింత పెంచి, ప్రజలు వీధుల్లోకి వచ్చేలా చేసింది. హిందూ సంస్థలు నిరసనకారులు తమ దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ఈ ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించాల్సి వచ్చింది. పరిస్థితుల తీవ్రత శస్త్ర సీమా బల్ (SSB) భారత సరిహద్దును పూర్తిగా మూసివేసింది. నేపాల్ నుంచి వచ్చే ప్రతీ వ్యక్తిపై నిఘాను పెంచింది.