NCERT UEducate deal: జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి (NCERT) – యూఎడ్యుకేట్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కీలక ఒప్పందంపై సంతకం చేసింది. ఈసందర్భంగా NCERT అధికారులు మాట్లాడుతూ.. భారతదేశ విద్యారంగంలో సంచలన మార్పులు తీసుకొచ్చే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. యూఎడ్యుకేట్ సహకారంతో ఎన్సీఈఆర్టీ తన మొత్తం పాఠ్యాంశాల్ని KATBOOK అనే ఇంటరాక్టివ్ డిజిటల్ ఫార్మాట్లోకి మార్చనుందన్నారు. ఈ ఫార్మాట్లో చదివే విద్యార్థులకు పాఠ్యాంశం వీడియోలు, యానిమేషన్లు, 3డీ మోడల్స్, సిమ్యులేషన్ల వంటి వివిధ మాధ్యమాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులకు క్లిష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకొనేలా ఈ పాఠాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
READ MORE: Real Estate: హైదరాబాద్‌లో మళ్లీ పుంజుకున్న భూముల ధరలు
యూఎడ్యుకేట్ గ్లోబల్ వ్యవస్థాపకుడు, ఎండీ శరత్ కాకుమాను మాట్లాడుతూ.. ఈ ఒప్పందం భారతీయ విద్యను మార్చే ప్రయాణంలో కీలక ముందడుగు అన్నారు. విద్యను మరింత సరదాగా, అందరికీ చేరేలా అన్ని భాషల్లో అందేలా చేస్తామన్నారు. KATBOOK ద్వారా తాము టీచర్లు, విద్యార్థులకు బోధనలో సహకారం అందిస్తామన్నారు. ప్రతి పిల్లవాడికీ నాణ్యమైన విద్య అందించాలనే తమ సంకల్పం ఈ ఒప్పందం ద్వారా నెరవేరబోతోందన్నారు. ఈ ఒప్పంద పత్రాలపై ఉన్నతాధికారుల సమక్షంలో ఎన్సీఈఆర్టీ కార్యదర్శి అమన్ శర్మ, యూఎడ్యుకేట్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డైరెక్టర్ మన్రైత్ చద్దా సంతకాలు చేశారు. జాతీయ విద్యా విధానం 2020, డిజిటల్ ఇండియా మిషన్ లక్ష్యాలకనుగుణంగా విద్యారంగంలో జరిగే ఉన్నత ప్రయోగాల్లో ఈ ప్రాజెక్టు ఒకటిగా నిలుస్తుందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు.
KATBOOK డిజిటల్ పుస్తకాలు..
ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో దాదాపు 2.5 కోట్ల మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అంచనా. KATBOOK డిజిటల్ పుస్తకాల్లో ఏఐ ఆధారిత క్లాస్‌రూమ్ టూల్స్, డిక్షనరీలు, ఆడియో బుక్స్, అనువాదాలు వంటి సౌకర్యాలు ఉంటాయి. విద్యార్థులు నేర్చుకొనే విధానాన్ని ఉపాధ్యాయులే ప్రత్యక్షంగా పర్యవేక్షించి.. వారు ఎదుర్కొనే ఇబ్బందులను గమనించి మరింత మెరుగైన బోధనా పద్ధతులను అనుసరించివచ్చు. ఇవి ఆఫ్‌లైన్లో ఉపయోగించుకొనే అవకాశం ఉండటంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకూ దీంతో ప్రయోజనం కలగనుంది. దీన్ని తొలుత కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రోగ్రామ్‌గా అమలు చేసి ఆ తర్వాత వచ్చే 18 నెలల్లో దేశ వ్యాప్తంగా విస్తరించనున్నారు.
READ MORE: Agni 5 missile test: విజయవంతమైన అగ్ని 5.. ఇక శత్రు దేశాలకు వణుకే..