NIA Raids In Popular Front Of India Case: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) టార్గెట్ గా రాజస్థాన్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దాడులు నిర్వహిస్తోంది. రాజస్థాన్ లోని ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా కోటాలో మూడు ప్రాంతాల్లో సవాయ్ మాధోపూర్, భిల్వారా, బుండి, జైపూర్ ప్రాంతాల్లో అనుమానితుల నివాస, వ్యాపార స్థలాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
Read Also: S Jaishankar: ముసలివాడు.. మూర్ఖపు అభిప్రాయాలు కలిగినవాడు.. జార్జ్ సోరోస్‌పై ఘాటు విమర్శలు
రాజస్థాన్‌లోని బరన్ జిల్లాకు చెందిన సాదిక్ సర్రాఫ్, కోటాకు చెందిన మహ్మద్ ఆసిఫ్‌తో పాటు పీఎఫ్ఐకి చెందిన మరికొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎన్ఐఏ రైడ్స్ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం జరిగిన సోదాల్లో పెద్ద ఎత్తున డిజిటల్ పరికరాలు, ఎయిర్ గన్స్, పదునైన ఆయుధాలు, నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పీఎఫ్ఐ భారత జాతీయభద్రతకు విఘాతం కలిగించేలా చట్టవ్యతిరేఖ కార్యకలాపాలకు, ఉగ్రవాద కార్యకలాపాకలు పాల్పడుతుందనే ఆరోపణలు రావడంతో గతేడాది సెప్టెంబర్ నెలలో ఎన్ఐఏ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)లు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ దాడులు చేశాయి. పెద్ద ఎత్తున అరెస్టులు జరిగాయి. సెప్టెంబర్ 28న పీఎఫ్ఐ, దాని ఎనిమిది అనుబంధ సంస్థలు కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పలు రాష్ట్రాల్లో జరిగిన హిందూ సంస్థల కార్యకర్తల హత్యల్లో పీఎఫ్ఐ ప్రమేయం ఉందని కేంద్రం తెలిపింది. తాజాగా ఈ సంస్థ వేరే పేరుతో మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పలువురిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.