Bride: ఆమెకు అప్పటికే 8 మంది పురుషులతో వివాహమైంది. పెళ్లి చేసుకోవడం ఎంచక్కా భర్తల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా పెట్టుకుంది. చివరకు 9వ పెళ్లి చేసుకునే సమయంలో పోలీసులకు పట్టుబడింది ఈ కిలాడీ ‘‘నిత్య పెళ్లికూతురు’’. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పురుషులను వివాహం చేసుకుని, వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
Read Also: ENG vs IND: టీ20 తరహా బ్యాటింగ్.. లంచ్ బ్రేక్‌కి ఇంగ్లండ్ స్కోర్ ఎంతంటే?
పోలీసులు నిందితురాలిని సమీరా ఫాతిమాగా గుర్తించారు. 9వ బాధితుడిని కలిసే సమయంలో పోలీసులకు పట్టుబడింది. నిందితురాలైన వధువు తన భర్తలను బ్లాక్‌మెయిల్ చేసి వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీరా తన భర్తల నుంచి డబ్బులు వసూలు చేయడానికి ఒక ముఠాతో కలిసి పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలు సమీరా చదువుకున్నదని, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలని తేలింది.
గత 15 ఏళ్లుగా ముస్లిం సమాజంలో ధనవంతులను, వివాహిత పురుషులను టార్గెట్ చేస్తూ వారిని మోసం చేసింది. ఆమె బాధితుల్లో ఒకరు రూ. 50 లక్షలు, మరొకరు రూ. 15 లక్షలు ఇచ్చేలా బ్లాక్‌మెయిల్ చేసిందని ఆరోపించారు. సమీరా తన టార్గెట్‌లను గుర్తించడానికి, ఆకర్షించడానికి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లను, ఫేస్‌బుక్‌ను ఉపయోగించిందని దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ఫేస్‌బుక్, వాట్సాప్ కాల్స్ ద్వారా ఎమోషనల్ కథలు చెబుతూ బుట్టలో వేసుకునేది. విడాకులు తీసుకున్న నిస్సాహాయురాలిగా, ఒక బిడ్డకు తల్లిగా సానుభూతి, నమ్మకాన్ని పొందేది. గతంలో ఒక కేసులో తాను గర్భవతి అని చెప్పుకోవడం ద్వారా అరెస్ట్ నుంచి తప్పించుకుంది. జూలై 29న, ఆమెను చివరకు నాగ్‌పూర్ లో ఓ టీ దుకాణంలో అరెస్ట్ చేశారు.