Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరిగిన కులగణనలో ఉద్దేశపూర్వకంగా ముస్లింలు, యాదవుల జనాభాను పెంచారని, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
నితీష్ కుమార్, బీజేపీ మిత్రపక్షంగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోడీని విమర్శించడమే జేడీయూ, ఆర్జేడీ పార్టీలు పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. నితీష్ కుమార్ ప్రధాని కావాలనే కలలు కనడం మానేయాలని, ఇండియా కూటమి కనీసం నితీష్ కుమార్‌ని కన్వీనర్‌గా కూడా చేయలేదని అన్నారు.
Read Also: Israel-Hamas War: గాజాపై అణుదాడి, ఇజ్రాయిల్ మంత్రి వ్యాఖ్యలు.. స్పందించిన పీఎం నెతన్యాహు
బీహార్ రాష్ట్రంలో గుండా రాజ్‌కి జేడీయూ నేత, సీఎం నితీష్ కుమారే కారణమని ఆరోపించారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని టార్గెట్ చేస్తూ.. జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించడానికి ఆర్జేడీ, జేడీయూలు మద్దతు ఇవ్వలేదని, ఆర్టికల్ 370ని తొలగిస్తే రక్తం ఏరులై పారుతుందని లాలూ అన్నారని, అయితే రక్తం పారడం వదిలేయండి, కనీసం అక్కడ గులకరాళ్లు వేసే ధైర్యం కూడా ఎవరూ చేయడం లేదని అమిత్ షా అన్నారు.
నితీష్ కుమార్ ప్రధాని కావాలని కలలు కంటున్నాడని, లాలూ తన కొడుకుని సీఎం చేయాలని అనుకుంటున్నారని, వీరిద్దరు కూడా కుటుంబ దుకాణాల్ని నడుపుతున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘నితీష్ బాబు ప్రధానిని వదిలేయండి, ఇండియా కూటమి మిమ్మల్ని కన్వీనర్‌గా కూడా చేయలేదు, చమురు, నీరు ఎప్పుడూ కలవవు, అవి వేరుగానే ఉంటాయి.’’ అని అమిత్ షా అన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బీహార్ లోని 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. కులగణనలో యాదవులు, ముస్లింల జనాభా పెరిగిందని, ఇతర వర్గాల జనాభా తగ్గిందని అన్నారు, సర్వే తప్పు అయితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించండి అంటూ సవాల్ విసిరారు. మీరు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.