Murder Case Against CBI Officials Over Death Of Bengal Violence Accused: కేంద్ర ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో బీర్భూమ్ హింసాకాండలో నిందితుడి మరణం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణం కాబోతోంది. బీర్బూమ్ హింసాకాండలో ప్రధాన నిందితుడిగా ఉన్న లాలన్ షేక్ సోమవారం సీబీఐ క్యాంపు కార్యాలయంలోని వాష్‌రూమ్‌లో శవమై కనిపించాడు. లాలన్ షేక్ ఆత్మహత్య చేసుకున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
Read Also: Udhayanidhi Stalin: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉదయనిధి స్టాలిన్..
అయితే దర్యాప్తు ప్రక్రియలో భాగంగా బొగ్తుయ్ గ్రామానికి వచ్చిన సీబీఐ అధికారులు తన భర్తను చంపేస్తామని బెదిరించారని లాలన్ షేక్ భార్య రేష్మా బీబీ మంగళవారం రాంపూర్ హట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే సీబీఐ మాత్రం ఇవన్నీ నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. బెంగాల్ రాష్ట్ర పోలీసులు ఈ ఫిర్యాదుపై సీబీఐ అధికారులపై విచారణ ప్రారంభించారు. సీబీఐ అధికారులపై హత్యనేరం కేసును నమోదు చేశారు బెంగాల్ పోలీసులు.
తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు బదు షేక్ హత్య తర్వాత బీర్భూమ్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ హింసాకాండలో బీర్బూమ్ జిల్లాలోని బోగ్తుయ్ గ్రామంలో 10 మంది చనిపోయారు. మహిళలు, పిల్లలను సజీవ దహనం చేశారు. దీంట్లో ప్రధాన నిందితుడిగా లాలన్ షేక్ ఉన్నాడు. ఈ కేసును కలకత్తా హైకోర్టు సీబీఐ అధికారులకు అప్పగించింది. హత్యాకాండా అనంతరం ఎనిమిది నెలల తర్వాత సీబీఐ అధికారులు లాలన్ షేక్ ను జార్ఖండ్ రాష్ట్రంలో అదుపలోకి తీసుకున్నారు. ఈ హింసాకాండతో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై, సీఎం మమతాబెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.