Moscow-Goa Flight With 244 Onboard Lands In Gujarat After Bomb Threat: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న అంజూర్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాన్ని గుజరాత్ జామ్‌నగర్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు ఉందని గోవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు జామ్ నగర్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే బాంబ్ స్క్వాడ్‌తో పాటు అగ్నిమాపక సిబ్బంది విమానాశ్రయానికి చేరుకున్నాయి. సీఐఎస్ఎఫ్ అధికారులు, కలెక్టర్, ఎస్పీ విమానాశ్రయానికి చేరుకున్నారు.
విమానంలో మొత్తం 240 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరందరిని కిందికి దించారు. విమానాన్ని తనిఖీ చేశారు. ‘‘మాస్కో-గోవా విమానంలో మొత్తం 244 మంది ప్రయాణికులతో రాత్రి 9.49 గంటలకు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత విమానాశ్రయంలో డి-బోర్డింగ్ చేశారు’’ అని జామ్‌నగర్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) బృందం కూడా విమానాశ్రయానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ తెలిపారు.
Read Also: Minister KTR : మేము కూడా పాన్ ఇండియాకి వెళ్తున్నాము
ఇదిలా ఉంటే దీనిపై రష్యా రాయబార కార్యాలయం స్పందించింది. బెదిరింపుల గురించి భారత అధికారులకు నుంచి తమకు సమాచారం అందిందని.. ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానం జామ్‌నగర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయిందని..విమానంలో ఉన్న అందరూ సురక్షితంగా ఉన్నారని..అధికారులు విమానాన్ని తనిఖీ చేస్తున్నారని పేర్కొంది.
ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని..ప్రజల రాకపోకలను పర్యవేక్షించేందుకు, అనుమానాస్పద కార్యలాపాలపై నిఘా పెంచేందుకు విమానాశ్రయంలో ప్రత్యేక బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. బాంబు బెదిరింపు పుకారు కావచ్చని.. భయపడాల్సిన పనిలేదని.. పోలీసులు అన్నారు.