Tamil Nadu: తమిళనాడులో అధికార డీఎంకేతో మిత్రపక్షాల సీట్ల ఒప్పందం దాదాపుగా ఖరారైంది. మిత్రపక్షాలైన వీసీకే, ఎండీఎంకేలతో సీట్ల సర్దుబాటు పూర్తైంది. రెండు పార్టీలతో 2019 ఒప్పందాన్ని మళ్లీ పునారవృతం చేశారు. విడుతలై చిరుతైగల్ కట్చి (విసికె)కి రెండు సీట్లు కేటాయించగా, ఈ రెండు కూడా రిజర్వ్డ్ సీట్లు. వైకో నాయకత్వంలోని ఎండీఎంకేకు ఒక సీటును కేటాయించారు. దీంతో పాటు 2019లో ఈ పార్టీకి ఒక రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు.
Read Also: Congress: ‘యువ న్యాయ్’ పేరుతో యువతకు కాంగ్రెస్ 5 హమీలు..
సీట్ల షేరింగ్ విషయమై డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తో వీసీకే, ఎండీఎంకే అధ్యక్షులు థోల్ తిరుమావళవన్, వైకో సీట్ల షేరింగ్‌పై సంతకాలు చేశారు. చిదంబరం, విల్లుపురం ఎంపీ స్థానాల నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందని వీకేసీ చీఫ్ తిరుమావళవన్ అన్నారు. ఈయన గతంలో చిదంబరం నుంచి పోటీ చేసి గెలుపొందాడు. అయితే, ఈ సారి పార్టీ ఒక జనరల్ సీటులో పాటు 3 స్థానాల్ని కోరిందని, అయితే తమిళనాడు, భారత రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, ఈసారి డీఎంకేని గెలిపించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు సీట్లు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. తమ పార్టీ కర్ణాటక, కేరళ, తెలంగాణలోని 15 స్థానాల నుంచి అభ్యర్థుల్ని బరిలోకి దింపుతుందని వెల్లడించారు.
సీట్ల పంపకం కుదిరిందని ఎండీఎంకే చీఫ్ వైకో తెలిపారు. డీఎంకే ఇప్పటికే వీసీకే, ఎండీఎంకేతో పాటు మిత్రపక్షాలైన సీపీఐ (ఎం), సీపీఐ, ఐయూఎంఎల్, కేఎండీకేలతో సీట్ల పంపకాల ఒప్పందాలను ఖరారు చేసుకుంది. కాంగ్రెస్‌తో ఇంకా ఒప్పందం కుదరలేదు. తమిళనాడులో సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్(ఎస్‌పీఏ)కి డీఎంకే నాయకత్వం వహిస్తోంది. 2019 ఎన్నికల్లలో పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాల్లో 38 స్థానాల్ని డీఎంకే కూటమి గెలుచుకుంది.