మరొక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఇటీవల ప్రభుత్వం బస్సులో ప్రయాణించిన ఆయన ప్రయాణికుల సమస్యల గురించి ఆరా తీశారు. ప్రజలు బస్సుల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి సీఎంకు విన్నవించారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ బస్సుల్లో సీసీ కెమెరాలతో పాటు ఎమర్జెన్సీ బటన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు, పిల్లల రక్షణకు నిర్భయ స్కీం అమలు చేయనున్నారు. మొదటి దశగా ఐదువందల బస్సుల్లో… తరువాతి దశలో 2500 బస్సుల్లో ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు.
దేశంలో వినూత్న సీఎంగా ఎంకే స్టాలిన్ పేరు తెచ్చుకుంటున్నారు. సామాన్యుడిగా మారి సామాన్యుడి సమస్యలను తెలుసుకుంటున్నారు. తాజాగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పబ్లిక్ బస్సులో ప్రయాణించడం ఇందుకు ఓ ఉదాహరణ. కరుణానిధి వారసుడిగా వచ్చి స్టాలిన్ గత ఎన్నికల్లో డీఎంకే పార్టీని ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకువచ్చారు. అధికారంలోకి రావడంతోనే వినూత్న పాలనకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఇచ్చే సంచులపై అంతకుముందు అన్నాడీఎంకే ప్రభుత్వానికి చెందిన గుర్తులు, జయలలిత, పళని స్వామి వంటి నాయకులు ఫోటోలు ఉన్నప్పటికీ… ప్రజాధనం దుర్వినియోగం కావద్దనే మంచి ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీకి సంబంధించి నాయకుల ఫోటోలు ఉన్నా కూడా ఆ బ్యాగులనే పంపిణీ చేసి శభాష్ అనిపించుకున్నారు. ప్రతీకార రాజకీయాలకు తమిళనాడు కేంద్ర బిందువుగా ఉండేది. స్టాలిన్ వచ్చిన తర్వాత వీటన్నింటికి చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది.
తన కాన్వాయ్ లోని వాహనాల వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా తగ్గించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలిత ప్రారంభించిన ‘అమ్మ’ క్యాంటిన్ లను అదే పేరుతో కొనసాగిస్తున్నారు. స్టాలిన్ తీసుకున్న మరోసాహసోపేత నిర్ణయం… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి ఉన్నత చదువులు చదివే వారికి రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గ్రామాల్లోంచి వచ్చే విద్యార్థులకు, పేద విద్యార్థులు 7.5 రిజర్వేషన్లు కల్పించారు. పొగడ్తలు మానకుంటే చర్యలు తప్పవని సొంత పార్టీ వారికే వార్నింగ్ ఇచ్చారు సీఎం స్టాలిన్.
ప్రోటోకాల్ ను పక్కన పెట్టి దార్లో ఉన్న మహిళ వద్దను నుంచి దరఖాస్తు తీసుకోవడమే కాకుండా ఆ దరఖాస్తుపై సంతకం చేయడంలో ఆయన పాలనాదక్షత కనిపిస్తోంది. మరోసారి ఇలాగే ఓ నిరుద్యోగి నుంచి దరఖాస్తు తీసుకుని ఔరా అనిపించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతన్న వేళ ఎమ్మెల్యేలంతా ఇంటి వద్ద నుంచే భోజనం తీసుకువచ్చేలా ఆదేశాలు జారీ చేసి తాను ప్రజల సీఎం అని అనిపంచుకున్నారు. దేశ వ్యాప్తంగా టోమాటో రేట్లు రూ.150 పెరిగిన వేళ తమిళనాడులోని ప్రజలకు టోమాటో అందుబాటు ధరలో లభించేలా ప్రభుత్వం తరుపున దుకాణాలు తెరిపించి కేవలం రూ. 79కే లభించేలా చర్యలు తీసుకున్నారు. చెన్నైలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తే స్వయంగా పలు కాలనీల్లో కాలినడకన తిరుగుతు ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల ఆదరణ పొందుతున్నారు సీఎం స్టాలిన్.