Lakhimpur Kheri Case: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించి, రాజకీయ దుమారానికి కారణం అయిన లఖీంపూర్ ఖేరీ రైతుల హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు 8 వారాలు బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్‌ను తిరస్కరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ఆశిష్ మిశ్రా సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేరం రుజువైతే తప్పా నిందితుడిని నిరవధికంగా జైలులో ఉంచలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
Read Also: Pathan Movie Row: సినిమా నడిపితే థియేటర్లని తగలబెడతాం.. బీహార్‌లో హిందూ సంస్థల ఆగ్రహం
బెయిల్ ఇచ్చే సందర్భంలో పలు కండిషన్లను పెట్టింది సుప్రీంకోర్టు. మిశ్రా విడుదలైన వారంలోపు ఉత్తర్ ప్రదేశ్ ను విడిచిపెట్టాలని, యూపీ, ఢిల్లీల్లో ఎక్కడా ఉండకూడని, మిశ్రా ఎక్కడ ఉన్నాడో కోర్టుకు తెలియపరచాలని, సాక్షిని ప్రభావితం చేసేందుకు ఆశిష్ మిశ్రా, అతని కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. బెయిల్ రద్దు చేస్తామని తెలిపింది. మేము మా స్వయంప్రతిపత్తి అధికారాలను ఉపయోగించడం ద్వారా ఇతర నలుగుర సహ నిందితులకు కూడా మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీం వెల్లడించింది. మిశ్రా ఎక్కడ ఉంటాడో తన లోకేషన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించింది.
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. 2021లో నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కారుతో రైతుల పైకి వేగంగా పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో నలుగురు రైతులు, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, కార్ డ్రైవర్, ఓ జర్నలిస్ట్ మరణించారు. ఈ ఘటనలో ఆశిష్ మిశ్రాతో పాటు మొత్తం 12 మందిపై హత్య, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు అయ్యాయి.