Mumbai Court: గుర్తు తెలియని మహిళకు రాత్రిపూట ‘‘ నువ్వు స్లిమ్‌గా ఉన్నావు, చాలా స్మార్ట్‌గా అందంగా ఉన్నాము, నువ్వుంటే నాకు ఇష్టం’’ అంటూ మెసేజ్ చేయడం అసభ్యకరమని ముంబైలోని సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. మాజీ కార్పొరేటర్‌కి వాట్సాప్‌లో అశ్లీల సందేశాలు పంపిన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ అదనపు సెషన్స్ జడ్జి (దిండోషి) డిజి ధోబ్లే ఈ వ్యాఖ్యలు చేశారు.
“నువ్వు సన్నగా ఉన్నావు”, “నువ్వు చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నావు”, “నువ్వు అందంగా ఉన్నావు”, “నువ్వు పెళ్లి చేసుకున్నావా లేదా?” వంటి సందేశాలతో కూడిన చిత్రాలను అర్థరాత్రి నిందితుడు మహిళకు పంపాడని కోర్టు తేల్చింది. తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి మెసేజులు రావడాన్ని వివాహిత స్త్రీ, ఆమె భర్త సహించరని కోర్టు పేర్కొంది. నిందితుడు, మహిళకు మధ్య సంబంధం ఉందని ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు చెప్పింది.
2022లో ఇదే కేసులో నిందితుడిని మేజిస్ట్రేట్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి 3 నెలల జైలు శిక్ష విధించింది, ఆ తర్వాత నిందితుడు ఈ తీర్పును సెషన్స్ కోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఇతర కారణాలతో పాటు రాజకీయ శత్రుత్వం కారణంగా తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని నిందితుడు పేర్కొన్నాడు. అయితే, కోర్టు అతడి వాదనల్ని తోసిపుచ్చింది. ఈ వాదనలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు చెప్పింది. ‘‘ అంతేకాకుండా, ఏ స్త్రీ కూడా తన గౌరవాన్ని పణంగా పెట్టి తప్పుడు కేసులో ఇరికించదు’’ అని కోర్టు పేర్కొంది. నిందితుడు ఆ మహిళకు అశ్లీల వాట్సాప్ సందేశాలు, చిత్రాలను పంపాడని ప్రాసిక్యూషన్ నిరూపించిందని కోర్టు తెలిపింది. దీంతో కింది కోర్టు విధించిన శిక్షను సెషన్స్ కోర్టు జడ్జి సమర్థించారు.