Chinese Manjha: ‘‘చైనీస్ మాంజా’’ గొంతులు కోస్తోంది. ప్రభుత్వాలు ఈ మాంజాపై నిషేధం విధించినప్పటికీ దొంగచాటున అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో గాలిపటాలకు ఈ దారాన్ని వినియోగిస్తున్నారు. ఇవి రోడ్డుపై వెళ్లే వారికి ప్రమాదంగా మారుతున్నాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడి ప్రాణం తీసింది.
Read Also: Maruti Suzuki: భారీ ఆఫర్ ప్రకటించిన మారుతీ.. కారుపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్
వివరాల్లోకి వెళ్తే, ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో బైక్‌పై వెళ్తున్న 21 ఏళ్ల యువకుడి సుహైల్ మాంజా దారం కారణంగా మరణించాడు. రోడ్డుపై పడి ఉన్న మాంజా బైక్‌పై వెళ్తుండగా గొంతును కోసింది. రెండు చెట్ల మధ్య ఉన్న మాంజా దారం గొంతుని సగానికి పైగా కోసింది. దీంతో సుహైల్ బైక్ బోల్తా పడింది. వెనకాల కూర్చున్న సుహైల్ స్నేహితుడు నవాజీష్‌కి కూడా గాయాలయ్యాయి. దారం అతడి ముక్కుని కోసింది. ఇద్దరిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సుహైల్ మరణించాడు.
చైనీస్ మాంజా పదునుగా ఉండేందుకు దానికి పొడిగా చేసిన గాజు లేదా లోహపు పొడిని పూస్తారు. దీని విక్రయం చట్టపరంగా నిషేదించబడింది. ఉల్లంఘించిన వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 1 లక్ష వరకు జరిమానాతో ఉంటుంది. గాలిపటాలు ఎగిరేసే క్రమంలో కొన్నిసార్లు ఈ దారాలు రోడ్లపై పడుతుంటాయి. ఈ క్రమంలో ముఖ్యంగా బైక్‌పై వెళ్లే వారి ప్రాణాలను తీస్తున్నాయి.