Masood Azhar: సోమవారం ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబ్ దాడితో దేశం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోసారి కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ పేరు వినిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఇతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. అయినప్పటికీ, పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ, పాక్ ప్రభుత్వ రక్షణలో ఉన్నాడు. 26/11 ముంబై దాడుల నుంచి తాజాగా జరిగిన ఢిల్లీ కార్ బ్లాస్ట్ వరకు ఇతడి ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నిధులతో ఉగ్రవాదాన్ని నడిపిస్తున్నాడు.
Read Also: PM Modi: డైరెక్ట్ భూటాన్ To ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రి..! క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోడీ..
ఎవరు ఈ మసూద్ అజార్.?
56 ఏళ్ల మసూద్ అజార్, పాక్ జైషే మహ్మద్ ఉగ్రసంస్థ చీఫ్, భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులు నిర్వహించాడు. ఖాట్మాండ్-ఢిల్లీ IC-814 విమానం హైజాక్ సమయంలో, ప్రయాణికుల్ని కాపాడుకోవడాని భారత ప్రభుత్వం జైలులో ఉన్న ఇతడిని విడుదల చేయాల్సి వచ్చింది. విడుదలైన కొంత కాలానికి 1999-2000లో జైష్ ను స్థాపించాడు. పాకిస్తాన్ బహవల్పూర్ కేంద్రంగా ఈ ఉగ్ర సంస్థ పని చేస్తోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో ఈ కేంద్రంపై భారత్ క్షిపణి దాడులు నిర్వహించింది. ఇప్పుడు పునర్మిర్మాణం కోసం పాక్ ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది. 2001లో పార్లమెంట్‌పై దాడి, 2008లో ముంబై ఉగ్రదాడులు, 2016లో పఠాన్ కోట్ ఉగ్రవాద దాడి, 2019లో పుల్వామా దాడులకు జైషే మహ్మద్ పాల్పడింది. తాజాగా ఢిల్లీ పేలుడు కేసులో కూడా ఈ ఉగ్ర సంస్థ మూలాలే ఉన్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో మసూద్ అజార్, సోదరి భర్త చనిపోయాడు. ఈ దాడుల్లో అతడి కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. దాడుల్లో మరణించిన వారిలో అజార్ అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు మరియు అతని కుటుంబంలోని ఐదుగురు పిల్లలు ఉన్నారు. గత నవంబర్ లో అజర్ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒక ఇస్లామిక్ సెమినరీలో బహిరంగ ప్రసంగం చేశాడు. భారత్‌పై దాడులు కొనసాగిస్తామని ఇతను ప్రతిజ్ఞ చేశాడు.
కొత్త తరహా ఉగ్రవాద దాడులకు పాల్పడేందుకు ఇటీవల మహిళా ఉగ్రవాద సంస్థ, జమాత్ ఉల్ మోయినాత్‌ను ప్రారంభించాడు. మహిళల్ని ఉగ్రవాదులుగా మార్చే రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా ప్రారంభించాడు. మహిళలకు అజార్ సోదరి సాదియా అజార్ శిక్షణ ఇస్తూ, చీఫ్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు, ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్ట్ కేసులో అరెస్టయిన మహిళా డాక్టర్ షాహీన్ సయీద్ ఇండియాలో ఈ మహిళా ఉగ్రవాద సంస్థకు చీఫ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.