Nithya Pellikoduku: దేశవ్యాప్తంగా 20కి పైగా వివాహాలు చేసుకున్న నిత్య పెళ్లికొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల్ని నమ్మించి పెళ్లి చేసుకుని వారి నగలు, ఇతర విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న 43 ఏళ్ల వ్యక్తిని మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం తెలిపారు. నల్లా సోపారాకు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఫిరోజ్ నియాజ్ షేక్‌ని అరెస్ట్ చేశారు. నిందితుడు థానే జిల్లాలోని కళ్యాణ్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతడిని జూలై 23న పోలీసులు పట్టుకున్నారు.
Read Also: Restaurant: ఫుడ్ ఆర్డర్‌తో ‘‘ఊరగాయ’’ ఇవ్వనందుకు రెస్టారెంట్‌కి రూ. 35000 ఫైన్..
ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. నిందితుడు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో తనతో పరిచయం పెంచుకున్నట్లు పేర్కొంది. రూ. లక్ష నగదు, ల్యాప్‌టాప్, ఇతర విలువైన వస్తువులను అతను తీసుకెళ్లినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. 2023 అక్టోబర్ మరియు నవంబర్‌లో మహిళ వద్ద నుంచి రూ.6.5 లక్షలు తీసుకెళ్లాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.
నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్‌బుక్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు మ్యాట్రిమోనియల్ సైట్లలో విడాకులు తీసుకున్న వారిని, వితంతువులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని విలువైన వస్తువులను తీసుకున్నట్లు విచారణలో తేలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ ,గుజరాత్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిందితుడు 2015 నుంచి 20 మంది మహిళల్ని ఇలా మోసం చేసినట్లు విచారణలో తేలింది.