పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఎలక్ట్రికల్ బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ వ్యక్తి ఆగ్రహంతో ఎలక్ట్రిక్ బైకుపై పెట్రోల్ పోసి కాల్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తిరుపత్తూర్ జిల్లా అంబూరుకు చెందిన ఓ వాహనదారుడు చాలా కాలం కిందట ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు. అయితే గత మూడు నెలల్లో మూడు సార్లకు పైగా తన ఎలక్ట్రిక్ బైక్ రిపేర్‌కు గురిరావడంతో వాహనదారుడు ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా అంబూర్ వద్ద ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో బైక్ ఆగిపోవడంతో నిరాశకు గురయ్యాడు. దీంతో పెట్రోల్ పోసి అందరూ చూస్తుండగానే వాహనానికి నిప్పుపెట్టాడు. కొనేటప్పుడు 100 కిలోమీటర్లు మైలేజ్ వస్తుందని చెప్పారని.. కనీసం 40 కి.మీ. మైలేజ్ కూడా రావడం లేదని సదరు వాహనదారుడు వాపోయాడు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా సంస్థ పట్టించుకోవడం లేదని.. అందుకే బైక్‌ను కాల్చేసినట్లు బాధితుడు తెలిపాడు.