Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలోని గుల్‌మార్గ్, గందర్‌బల్ జిల్లాలోని గగాంగీర్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో నిందితుల ఆచూకీ కోసం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. తంగ్ మార్గ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అక్టోబర్ 24న బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రదాడి చేయడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లతో సహా మరో ఇద్దరు మరణించారు.
Read Also: Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ హోటళ్లకు వరస బాంబు బెదిరింపులు..
ఈ ఘటనకు ముందు అక్టోబర్ 2న గంగర్‌బాల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారి సొరంగం నిర్మాణంలో పనిచేస్తున్న నిర్మాణ కార్మికులు, ఇతర సిబ్బందిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు వర్కర్స్‌తో పాటు ఒక డాక్టర్ మరణించారు. కార్మికులు, ఇతర సిబ్బంది తమ శిబిరాలకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా అనుమానిస్తున్నారు. మరోవైపు స్థానికేతర కూలీలను టార్గెట్ చేస్తున్నారు ఉగ్రవాదులు.
ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మాణాల చుట్టూ భద్రతా సిబ్బందిని కట్టుదిట్టం చేయాలని బుధవారం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశంచారు. గుల్‌మార్గ్‌లోని బుటాపత్రి ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికులు, కూలీలకు ఆయన నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్(సీఐకే) కాశ్మీర్ లోయలోని ఆరు జిల్లాల్లో ఆపరేషన్ నిర్వహించి, ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న రిక్రూటర్లను పట్టుకుంది. నగర్, గందర్‌బల్, పుల్వామా, అనంత్‌నాగ్, బుద్గాం, కుల్గాం జిల్లాల్లో దాడులు నిర్వహించినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సమాచారం. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ‘తెహ్రీక్ లబైక్ యా ముస్లిం’ (టీఎల్‌ఎం) పేరుతో కొత్తగా ఏర్పడిన ఉగ్రవాద సంస్థ రిక్రూట్‌మెంట్ మాడ్యూల్‌ను దెబ్బతీసినట్లు అధికారులు తెలిపారు.