దేశవ్యాప్తంగా జ్ఞానవాపి మసీదు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ వీడియో సర్వేకు అనుమతి ఇవ్వడంతో వివాదం మరింతగా ముదిరింది. ఈ నెల 14 నుంచి 16 వరకు మసీదులో కోర్ట్ నియమించిన కమిషనర్లు వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఈ సర్వేను ఆపేయాలంటూ జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. సర్వేలో భాగంగా మసీదు ‘ వాజుఖానా’ లోని బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్, శివలింగం బయటపడిన ప్రదేశానికి భద్రత కల్పించాల్సిందిగా వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇదే విధంగా ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ రోజు మరోసారి జ్ఞానవాపి మసీదు సర్వేపై సుప్రీంలో విచారణ జరిగింది. మే 20 వరకు సుప్రీం కోర్ట్ విచారణ జరిపే వరకు వారణాసి కోర్ట్ విచారణను నిలిపివేయాలంటూ గురువారం ఆదేశాలు జరీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే కోర్ట్ ఆదేశాలు వెల్లడించిన తర్వాత మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రోజుల పాటు ఔరంగజేబు సమాధిని మూసేయాలని నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం కోర్ట్ పరిధిలో జ్ఞానవాపి మసీదు వివాదం నడుస్తోంది. ఈ సమయంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జౌరంగాబాద్ ఖుల్తాబాద్ లో ఉన్న ఔరంగజేబు సమాధికి తాళం వేశారు. దీంతో పాటు సెక్యురిటీ గార్డులను ఏర్పాటు చేశారు. ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా, మసీదు కమిటీ సమాధికి తాళం వేశాయి. ఇటీవల మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధికార ప్రతినిధి గజానన్ కాలే స్మారకాన్ని ధ్వంసం చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఐదు రోజుల పాటు ఔరంగజేబు సమాధిని మూసేస్తున్నట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. అయితే మొగల్ పాలకుడు ఔరంగజేబ్ పాలనలోనే జ్ఞానవాపి ఆలయాన్ని కూల్చి మసీదుగా మార్చారని చరిత్ర చెబుతోంది.