మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం ఆసక్తికర పరిణామం జరిగింది. అజిత్ పవార్ గురించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు. అజిత్ పవార్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారంటూ ఫడ్నవిస్ జ్యోసం చెప్పారు.
ఇటీవలే మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు. అజిత్ పవార్ అయితే ఆరోసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మహారాష్ట్రలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఫడ్నవిస్ మాట్లాడుతూ.. అజిత్ పవార్‌ను చాలా మంది శాశ్వత డిప్యూటీ సీఎం అంటూ వ్యాఖ్యానిస్తారని.. కానీ ఏదో ఒక రోజు అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు.
అజిత్ పవార్ ఏ విధంగా పని చేస్తారో.. ఏక్‌నాథ్ షిండే ఏ విధంగా ఉంటారో.. తాను ఏ విధంగా పని చేస్తానో ప్రజలందరికీ తెలుసన్నారు. అజిత్ పవార్ ఉదయాన్నే లేచి పనులు చక్కబెడతారని.. షిండే అయితే రాత్రంతా పని చేస్తారని.. తాను మాత్రం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పని చేస్తానని అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను 230 సీట్లు సాధించాయి. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు సాధించాయి. కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే 20, శరద్ పవార్ 10 స్థానాల్లో గెలుపొందాయి. అయితే అజిత్ పవార్.. 2023లో శరద్ పవార్ పార్టీ నుంచి విడిపోయి.. మహాయుతి కూటమిలో చేరి.. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా వరుసగా ఆరు సార్లు డిప్యూటీ సీఎం అయ్యారు. ఎప్పటి నుంచో ఆయనకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉంది. మొత్తానికి ఫడ్నవిస్.. అజిత్ పవార్ గురించి జోస్యం చెప్పారు. ఈ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.