Rare Disease: సాధారణంగా ప్రతి మనిషికి తల, మర్మాంగాలను మినహాయిస్తే చెస్ట్, కాళ్లు, చేతులపై మాత్రమే వెంట్రుకలు పెరుగుతాయి. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల లలిత్ పాటిదార్ మాత్రం అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. హైపర్ ట్రికోసిస్ అనే వ్యాధి కారణంగా లలిత్ పాటిదార్ శరీరం అంతటా విపరీతంగా వెంట్రుకలు పెరుగుతున్నాయి. ఆరేళ్ల వయసు నుంచి తనకు శరీరం అంతటా వెంట్రుకలు రావడం ప్రారంభమయ్యాయని, పాఠశాలలో తనను చూసి అందరూ భయపడతారని లలిత్ పాటిదార్ చెబుతున్నాడు. కోతి లేదా దెయ్యం అని పిలిచేవారని వాపోయాడు. తన శరీరంపై తోడేలు మాదిరిగా కనిపించే జుట్టును చూసి కొందరు రాళ్లు విసిరేవాళ్లు అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Also: విలాసాల స్వర్గం దుబాయ్ లో కోట్లు విలువ చేసే ఇళ్లు ఉన్న స్టార్లు వీరే..
అయితే తన శరీరంపై వెంట్రుకలు మరీ ఎక్కువగా పెరిగినప్పుడు ట్రిమ్ చేసుకుంటానని లలిత్ పాటిదార్ వెల్లడించాడు. తన కుటుంబసభ్యులకు ఎవరికీ ఇలాంటి వ్యాధి లేదని వివరించాడు. శరీరంపై ఎక్కడైనా జుట్టు అధికంగా పెరిగితే ఈ వ్యాధిబారిన పడినట్లుగా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వచించింది. రెండు విభిన్న రకాల్లో ఈ వ్యాధి సంభవిస్తుందని తెలిపింది. జనరలైజ్డ్ హైపర్ ట్రికోసిస్ (ఇది శరీరం మొత్తంపై వ్యాపిస్తుంది) ఒకటి కాగా.. లోకలైజ్డ్ వెర్షన్(ఇది శరీరంలోని నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే పరిమితం) మరొకటి అని వివరించింది. కాగా ఈ హైపర్‌ట్రికోసిస్ వ్యాధి పుట్టుకతో లేదా యుక్తవయస్సులో వీటి మూలాలు కనిపించే అవకాశం ఉంది. ‘వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్’ అని కూడా పిలువబడే ఈ వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదని వైద్యులు చెప్తున్నారు. కాగా మధ్యయుగం నాటి నుంచి కేవలం 50 మందికే వ్యాధి వచ్చిందన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేకపోవడంతో శరీరంపై పెరిగిన జుట్టును ట్రిమ్మింగ్, షేవింగ్, వాక్సింగ్, లేజర్ లేదా ఇతర హెయిర్ రిమూవల్ పద్ధతుల ద్వారా మాత్రమే తొలగించుకోవాల్సి ఉంటుంది.