The age of consent: మధ్యప్రదేశ్ హైకోర్టు మైనర్లు, వారి సంబంధాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల సెక్స్ సమ్మతి వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. చాలా క్రిమినల్ కేసుల్లో యుక్తవయసులో ఉన్న అబ్బాయిలకు అన్యాయం జరుగుతోందని మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ దీపక్ కుమార్ అగర్వాల్‌తో కూడిన సింగిల్ జడ్జ్ ధర్మాసన వ్యాఖ్యానించింది.
2020 జూలై 17న నమోదైన అత్యాచారం కేసును విచారిస్తున్న సందర్భంలో కోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో చిన్న వయసులోనే అందరికీ అవగాహన వస్తోందని పేర్కొంది. ఎక్కువగా ఇంటర్నెట్ వాడకం వల్ల చిన్న వయసులోనే అన్ని విషయాలపై మైనర్లకు అవగాహన వస్తోందని, వారికి 14 ఏళ్లలోపే యుక్తవయసు వస్తుందని పేర్కొంది. దీని ఫలితంగా సమ్మతితోనే బాలురు, బాలికల మధ్య శారీరక సంబంధాలు ఏర్పడుతున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. క్రిమినల్ లా(సవరణ) చట్టం 2013 ప్రకారం.. ఒక అమ్మాయి లైంగిక సంపర్కానికి అంగీకరించే వయసును 18 ఏళ్లకు పెంచడం వల్ల యుక్తవయసులో ఉన్న అబ్బాయిలకు అన్యాయం జరుగుతోందని కోర్టు పేర్కొంది.
2013 సవరణ చట్టం అమలుకు ముందు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికతో లైంగిక సంబంధం బాలిక సమ్మతితో సంబంధం లేకుండా అత్యాచారంగా పరిగణించబడింది. అయితే, 2013 సంవత్సరంలో చట్టం సవరణ ద్వారా సమ్మతి వయస్సును 18కి పెంచింది. 18సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకోవడం బాలిక అనుమతి ఉన్నప్పటికీ అత్యాచారంగా పరిగణించబడుతుందని చట్టం సూచిస్తుంది.
గ్వాలియర్ చెందిన 14 ఏళ్ల బాలిక చేసిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద 17 ఏళ్ల బాలుడిపై అత్యాచారం అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో 2020లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ నను మద్యప్రదేశ్ హైకోర్టు గురువారం కోట్టేసింది.