Tiger Reserve: దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్, దామోహ్, నార్సింగ్ పూర్, రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉన్న నౌరదేహి వన్యప్రాణుల అభయారణ్యం, దామోహ్ జిల్లాలోని రాణి దుర్గావతి వన్యప్రాణుల అభయారణ్యాన్ని విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలియజేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరో రెండు మూడు నెలల్లో కొత్త టైగర్ రిజర్వ్‌ని ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు వన్యప్రాణి అభయారణ్యాలను కలపడంతో కొత్తగా ఏర్పాటు చేయబోయే టైగర్ రిజర్వ్ 2300 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించి, దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ కానుంది.
Read Also: Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిపై మూత్ర విసర్జన చేసి, దాడి..
కొత్త టైగర్ రిజర్వ్ ఈ ప్రాంతంలోని పులుల జనాభా పెరిగేందుకు మరింత సాయపడుతుందని, ప్రస్తుతం 16 వద్ద ఉన్న పులుల జనాభాను మరింతగా పెరిగేందుకు దోహదపడుతుందని దామోహ్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఎంఎస్ ఉకేయ్ తెలిపారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో అభివృద్ధితో పాటు పర్యాటకం పెరుగుతుందని అన్నారు. దామోహ్ లోని జబేరా ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమైన ఈ టైగర్ రిజర్వ్, ఇతర ప్రాంతాల నుంచి మరిన్ని పులులను ఆకర్షించే అవకాశం ఉంది.