Anti-cheating bill: ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల్లో పరీక్షా పత్రాల లీక్ వంటి మోసపూరిత పద్ధతులను అరికట్టేందుకు ఉద్దేశించిన యాంటీ చీటింగ్ బిల్లును మంగళవారం లోక్‌సభ ఆమోదించింది. ‘‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు’’ తదుపరి రాజ్యసభ ఆమోదం కోసం వెళ్లింది. రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో చట్టంగా మారనుంది. ఈ బిల్లు చిత్తశుద్ధితో ప్రభుత్వ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను టార్గెట్ చేయదు, ఎవరైతే అధికారులతో కుమ్మక్కై పరీక్ష పత్రాలను లీక్ చేసినా లేదా జవాబు పత్రాలను ట్యాంపర్ చేసినా 10 ఏళ్ల జైలు శిక్ష మరియు రూ. 1 కోటి జరిమానా విధించబడుతుంది.
ఈ బిల్లు కింద అన్ని నేరాలు గుర్తించదగినవి, నాన్ బెయిలబుల్, నాన్-కాంపౌండ్ చేయదగినవి, పోలీసులు సొంతంగా చర్య తీసుకునే అధికారం ఉంటుంది. అంటే వారెంట్ లేకుండా అనుమానితులను అరెస్ట్ చేయడం వంటివి బిల్లులో పొందుపరిచారు. నిందితుడికి బెయిల్ అర్హత ఉండదు, ఆరోపించిన నేరం రాజీ ద్వారా పరిష్కరించబడదు. కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తోమర్ దిగువ సభ(లోక్‌సభ)లో ప్రవేశపెట్టారు. అన్యాయమైన మార్గాల ద్వారా పేపర్ లీకేజీలను అడ్డుకునేందుకు ఈ బిల్లు సహకరిస్తుంది.
Read Also: Teeth: పసుపు పచ్చని పళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి మెరిసిపోతాయి..!
బిల్లు ప్రకారం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, మినిస్ట్రీలు లేదా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు ఇతర అధికారులు నిర్వహించే పరీక్షలు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్’లో ఉంటాయి.
ఈ బిల్లు ప్రకారం.. పేపర్ లీక్ చేసినందుకు లేదా జవాబు పత్రాలను ట్యాంపరింగ్‌కి పాల్పడిన వ్యక్తి లేదా సమూహానికి కనీసం మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడుతుంది, రూ. 10 లక్షల జరిమానా విధిస్తారు. పేపర్ లీక్ కేసులో నిర్వహణ సంస్థలతో కుమ్మకై వ్యవస్థీకృత నేరం కింద దోషులుగా తేలితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష విధించబడుతుంది. రూ.1 కోటి వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కంటే తక్కువ స్థాయి లేని అధికారి ఫిర్యాదులపై దర్యాప్తు బాధ్యతలను కలిగి ఉంటారు.