లాక్‌డౌన్ దేశ రాజధాని ఢిల్లీలో మంచి ఫలితాలు ఇస్తోంది.. క్రమంగా కొత్త కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. అయినా, ముందుచూపుతో.. మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుండగా.. మరోసారి ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఢిల్లీ బాటలో మరో రాష్ట్రం కూడా అడుగులు వేసింది.. కరోనా ఉధృతి నేపథ్యంలో హర్యానాలో మరోసారి లాక్‌డౌన్ పొడిగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఇక్కడ తొలిసారి ఈ నెల 3 నుంచి 10 వరకు లాక్‌డౌన్ విధించగా.. ఆ తర్వాత 17 వరకు పొడిగించారు.. ఇక, రేపటితో లాక్‌డౌన్ ముగియనుండటంతో ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ నెల 24 వరకు హర్యానాలో లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ప్రకటించింది. అయితే, కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని ఆ రాష్ట్ర హోం, ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ అధికారులను ఆదేశించారు.