Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ప్రపంచంలో ఇస్రో, భారత్ కీర్తి పెరిగాయి. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనాల తరువాత నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ని దించిన తొలిదేశంగా భారత్ నిలిచింది. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు తమ పనిని ప్రారంభించాయి.
ఇదిలా ఉంటే చంద్రుడిపై సూర్యరశ్మి తగ్గిపోతుండటంతో రోవర్, ల్యాండర్లు రెండింటిని స్లీప్ మోడ్ లోకి పంపేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రుడి దక్షిణ ధృవంపై 14 రోజుల వరకు మాత్రమే సూర్యుడి కాంతి పడుతుంది. మరో 14 రోజుల పాటు కఠిక చీకటి, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు పూర్తిగా సూర్యకాంతిపై ఆధారపడే సోలార్ సెల్స్ తో పనిచేస్తుంటాయి. అయితే ప్రస్తుతం దక్షిణధృవంపై సూర్యకాంతి తగ్గుతుండటంతో రానున్న రోజుల్లో ల్యాండర్, రోవర్లను స్లీప్ మోడ్ లోకి పంపేందుకు ఇస్రో సమాయత్తం అవుతుంది. దీనిపై ఇస్రో చీఫ్ సోమనాథ్ కూడా ప్రకటన చేశారు.
మరోవైపు రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి నేలపై తిరుగుతోంది. అక్కడి నేలలోని మూలకాలను విశ్లేషిస్తోంది. చంద్రుడి ఉపరితలంపై ఆక్సిజన్, సల్ఫర్ తో పాటు ఐరన్, క్రోమియం, సిలికాన్ వంటి మూలకాలు ఉన్నట్లు చంద్రయాన్-3 ప్రయోగంతో తెలిసింది. రోవర్ 100 మీటర్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. దీనిపై ఇస్రో ట్వీట్ కూడా చేసింది.