Lancet Warns About ‘Tomato Flu’ In India: ఇప్పటికే ఇండియా రకరకాల వైరస్ వ్యాధులతో బాధపడుతోంది. కోవిడ్ ఎలాగూ గత రెండున్నరేళ్ల నుంచి దేశంలోని ప్రజలకు సోకుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్ కేసులు కూడా ఇండియాలో నమోదు అయ్యాయి. దీంతో పాటు అక్కడక్కడ స్వైన్ ఫ్లూ వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త వైరస్ వ్యాధి పట్ల భారతదేశం అప్రమత్తంగా ఉండాలని లాన్సెట్ రెసపిరేటరీ జర్నల్ తన నివేదికలో హెచ్చరించింది.
ఇండియాలో కొత్తగా ‘టామోటో ఫ్లూ’ వ్యాధి వెలుగులోకి వచ్చింది. పాదం, చేతులు, నోటి ప్రాంతాల్లో పెద్దగా ఎర్రని పొక్కులు రావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలే ఈ వ్యాధికి ప్రభావితం అవుతుంటారు. తాజాగా ఈ వ్యాధి గురించి లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ వివరాలను వెల్లడించింది. టమోటో ఫ్లూ కేసులు మొదటగా కేరళలోని కొల్లంలో మే 6న నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 82 మంది పిల్లలకు ఈ వ్యాధి సోకింది. వ్యాధి సోకిన పిల్లలంతా 5 ఏళ్లలోపు వారే అని లాన్సెట్ వెల్లడించింది.
Read Also: Himachal Pradesh: వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 13 మంది మృతి
ఇంటెస్టినల్ వైరస్ ( పేగులో ఉండే వైరస్)ల వల్ల టమోటో ఫ్లూ వస్తుంది. అయితే పెద్దవాళ్లలో ఈ వ్యాధి చాలా అరుదుగా కనిపిస్తుంది. ఎందుకంటే.. పెద్దవాళ్ల ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో ఈ వైరస్ ను ఎదుర్కొంటోంది. అయితే పిల్లలు మాత్రమే ఎక్కువగా ఈ టమోటో ఫ్లూ బారిన పడుతుంటారు. శరీరంపై ఎర్రగా.. పెద్దగా బొబ్బలు ఏర్పడతాయి. టమోటో సైజుకు పెరుగుతాయి. దీంతో ఈ ఇన్ఫెక్షన్ ను టమోటో ఫ్లూగా వ్యవహరిస్తుంటారు. చికెన్ గన్యా లాగే అధిక జ్వరం, శరీర నొప్పులు, కీళ్ల వాపు, అలసట ఈ వ్యాధి లక్షణాలు. కొంత మంది రోగుల్లో వికారం, వాంతులు, డయేరియా, జ్వరం, డీ హైడ్రేషన్ వంటి లక్షణాలు ఉంటాయి.
లాన్సెట్ ప్రకాం,.. కేరళలో అంచల్, ఆర్యంకావు, నెడువత్తూర్ ప్రాంతాలు ఈ వ్యాధికి ప్రభావితం అయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల సరిహద్దుల్లో ఉన్న తమిళనాడు, కర్ణాటకల్లో కూడా అలర్ట్ ఏర్పడింది. ఒడిశాలో 26 మంది పిల్లలు ఈ వ్యాధి బారినపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియాలో కేరళ, తమిళనాడు, ఒడిశా ప్రాంతాల్లోనే ఈ వ్యాధి ప్రబలింది. ఇది సాధారణంగా స్వయం పరిమిత వ్యాధి. ఈ వ్యాధికి నిర్థిష్ట చికిత్సలేదు. లక్షణాలను బట్టి చికిత్స చేస్తారు. కొన్ని రోజుల్లో మన వ్యాధినిరోధక వ్యవస్థ వైరస్ ను శరీరం నుంచి తొలిగిస్తుంది.