కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా అత్యంత దారుణంగా ఆమె హత్యాచారానికి గురైంది. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో వెలడైన విషయాలతో గుండెలు తరుక్కుపోతున్నాయి. అంత భయంకరంగా ఓ విద్యాకుసుమాన్ని పాడు చేసి చంపేశాడు మృగాడు. కళ్లు, నోరు, ముక్కు, ప్రైవేటు భాగాల నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగింది అంటే.. ఎంత దారుణంగా హత్యాచారానికి గురైందో పోస్టుమార్టం రిపోర్టుతో అర్థమవుతోంది. మరోవైపు ఫైనల్ రిపోర్టు కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. ఈ నివేదిక వస్తే.. మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.
ఇదిలా ఉంటే హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. హత్యాచారం తర్వాత నిందితుడు ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోయినట్లుగా పోలీసులు తెలిపారు. నిద్ర నుంచి లేచాక బట్టలపై ఉన్న రక్తపు మరకలు కనబడకుండా ఉతుక్కు్న్నాడని చెప్పారు. అయితే బూట్లపై మాత్రం రక్తపు ఆనవాళ్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. సివిల్ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్‌కి ఆస్పత్రితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అప్పుడప్పుడు మాత్రం ఆస్పత్రికి వస్తాడని విచారణలో తేలిందన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని సిటీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ వెల్లడించారు. అయితే బాధితురాలి తుది పోస్టుమార్టం రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తమ దగ్గర ఉన్న ఆధారాలతో పోస్టుమార్టం రిపోర్టును పోల్చి చూడాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ప్రాథమిక పోస్ట్‌మార్టం రిపోర్టు.. బాధితురాలి కళ్లు, నోరు, ప్రైవేటు అవయవాల నుంచి రక్తస్రావం జరిగినట్లుగా తేలినట్లు సమాచారం. అంతేకాకుండా ఇతర భాగాల్లో కూడా గాయాలు ఉన్నట్లుగా తేలింది. అయితే వైద్యురాలిని మొదట హత్య చేసి.. ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఉంటాడని మరో పోలీసు అధికారి వెల్లడించారు.
గురువారం అర్ధరాత్రి వరకు బాధితురాలు కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో ఒలింపిక్స్ గేమ్స్‌ను తన సహచరులతో చూసినట్లుగా తెలుస్తోంది. అనంతరం దాదాపు 2 గంటల ప్రాంతంలో అందరితో కలిసి డిన్నర్ చేసింది. అనంతరం నిద్ర రావడంతో ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లోకి వెళ్లింది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 3-6 గంటల ప్రాంతంలో ఆమె హత్యాచారానికి గురై ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం బాధితురాలు నగ్నంగా శవమై పడి ఉండడంతో సహచరులు భయాందోళన చెంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే వైదురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇక వైద్యులు విధులు బహిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. ఆందోళనలు ఉధృతం కావడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సోమవారం ఉదయం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు అల్టిమేటం విధించారు. ఆదివారంలోగా కేసు కొలిక్కి తీసుకురాకపోతే సీబీఐకి అప్పగిస్తానని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే దర్యాప్తుపై వస్తున్న వందతులను పోలీసులు కొట్టిపారేశారు. ఎవరూ పుకార్లు నమ్మొద్దని.. నిష్పాక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో పనిచేసిన సిబ్బందిని విచారించామని.. అలాగే సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా చేపట్టినట్లు వివరించారు.