Delhi Drug Case: ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడిన కేసులో ప్రధాన సూత్రధారి కాంగ్రెస్ కార్యకర్త అని పోలీస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ కార్యకర్తగా ఆరోపించబడుతున్న ఇతడికి ఆ పార్టీతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలో బుధవారం నిర్వహించిన దాడిలో రూ. 5600 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్,40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి తుషార్ గోయల్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
40 ఏళ్ల గోయల్ 2022 వరకు ఢిల్లీ పీసీసీ ఆర్టీఐ సెల్ చైర్మన్‌గా పనిచేశారని విచారణ సందర్భంగా అంగీకరించాడు. గోయల్ తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో ఆర్టీఐ చైర్మన్, ఢిల్లీ పీసీసీ అని పెట్టుకున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇతను లోక్‌సభ ఎంపీ దీపేందర్ సింగ్, హర్యానా పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్‌తో సహా ప్రముఖ కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు.
Read Also: Minister Savita: బీసీ కుల వృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెంపొందించేలా ఆర్థిక చేయూత..
ఈ కేసులో గోయల్‌తో పాటు ఢిల్లీకి చెందిన హిమాన్షు కుమార్, ఔరంగజేబ్ సిద్ధికీ, భరత్ కుమార్ జైన్‌లతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొకైన్ వివిధ రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి స్మగ్లింగ్ అవుతోందని, గంజాయి థాయ్‌లాండ్ లోని ఫుకెట్ నుంచి వచ్చినట్లు తేలింది. నిందితులు క్రిప్టోకరెన్సీని ఉపయోగించి నిఘా వర్గాల నుంచి తప్పించుకున్నారు. కొకైన్ రవాణా వెనక దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రయేయం తెలుస్తోంది. ఢిల్లీలో హై ప్రొఫైల్ పార్టీలకు ఈ డ్రగ్స్ సరఫరా చేయబడుతున్నట్లు తేలింది. ఈ డ్రగ్ కార్టెల్ ప్రధాన సూత్రధాని పశ్చిమాసియా దేశం నుంచి భారతదేశంలో తన కార్యకలాపాలను నడుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.