Mallikarjun Kharge: అమెరికా సుంకాలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రధాని మోడీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ స్నేహితులు కావచ్చు, కానీ మోడీ దేశానికి శత్రువు అయ్యారని ఆరోపించారు. కర్ణాటక కలబురిగిలో జరిగిన మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ, ట్రంప్ ఒకరి కోసం ఒకరు ఓట్లు కోరినందున వారు మంచి ఫ్రెండ్స్ గా ఉండవచ్చని అన్నారు.
Read Also: Pizza: “పిజ్జా”కు యుద్ధానికి సంబంధం ఏమిటి.. అమెరికాలో ఏం జరుగుతోంది..?
‘‘ట్రంప్, మోడీ మంచి స్నేహితులు కావచ్చు. కానీ మోడీ దేశానికి శత్రువుగా మారారు. అతను వాతావరణాన్ని చెడగొట్టాడు’’ అని ఖర్గే ఆరోపించారు. ట్రంప్ విధించిన సుంకం దేశ ప్రజలను నాశనం చేసిందని అన్నారు. మోడీ వ్యక్తిగత స్నేహాన్ని వదిలి దేశ ప్రయోజనాలను ముందుంచాలి అని అన్నారు. దేశం మొదటి నుంచి అలీన విధానం, తటస్థతను అనుసరిస్తోందని, మోడీ కూడా ఇదే తరహాగా వ్యవహరించాలని హితవు పలికారు.
జీఎస్టీ తగ్గింపును స్వాగతించిన ఖర్గే, కానీ గత 8 ఏళ్లుగా బీజేపీ ప్రజల్ని దోచుకుంటోందని ఆరోపించారు. బీహార్ ఎన్నికల గురించి స్పందిస్తూ.. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, చట్టవ్యవస్థ లేదని, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, దళితులకు-ఓబీసీలకు విద్యా పథకాలు లేవని ఆరోపించారు. ఓట్ల మోసం కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన అంశమే అని ఖర్గే చెప్పారు.