Rahul Gandhi defamation case: పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సూరత్ హైకోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధ్య చట్టం-1951 ప్రకారం రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు జైలు శిక్ష పడితే ఆటోమెటిక్ గా పదవి కోల్పోతారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా తన ఎంపీ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ కేసులో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
Read Also: Rahul Gandhi: “కేవలం తన గురించి మాత్రమే మాట్లాడుతాడు”.. ప్రధానిపై రాహుల్ విమర్శలు
ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన రికార్డులు, న్యాయవిచారణ క్రమాన్ని తమకు సమర్పించాలని సూరత్ కోర్టను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ ఆదేశించారు. మే 4 నుంచి తాను విదేశాలకు వెళ్లాల్సి ఉందని, అందుబాటులో ఉండనని ఈ లోపే వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ రోజు లేదా ఎల్లుండి కల్లా వాదనలు విని విచారణను ముగిస్తానని జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ వెల్లడించారు.
2019 లోక్ సభ ఎన్నికల సందర్భంలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ ఇంటి పేరున్న వారంతా దొంగలే అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ క్రిమినల్ పరువునష్టం కేసును పెట్టారు. దీన్ని విచారించిన సూరత్ న్యాయస్థానం రాహుల్ గాంధీని దోషిగా నిర్థారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం పూర్ణేష్ మోడీ తరుపున నిరుపమ్ నానావతి గుజరాత్ హైకోర్టులో వాదనలు వినిపించారు.