Kerala High Court: మలయాళంలో వివాదాస్పద నటుడు, 2017లో నటి లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న యాక్టర్ దిలీప్ శబరిమల దర్శనం వివాదాస్పదమైంది. నటుడు దిలీప్‌కు శబరిమల దర్శన సమయంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి), రాష్ట్ర పోలీసులు ‘వీఐపీ’ ట్రీట్మెంట్ ఇవ్వడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీ దర్శన సమయంలో ఎంత మంది సాధారణ భక్తులు వేచి ఉన్నారు..?పోలీసులు ఎస్కార్ట్‌లతో సహా దిలీప్ ప్రత్యేక ప్రవేశానికి ఎలా అనుమతించాలని శుక్రవారం కోర్టు ప్రశ్నించింది.
Read Also: Nobel Prize: మహ్మద్ యూనస్ ‘‘హిందువుల కసాయి’’.. నోబెల్ అవార్డుని పున:పరిశీలించాలి..
‘‘పోలీస్ ఎస్కార్ట్‌తో దర్శనం ఎలా పొందుతున్నారు..? వీఐపీ దర్శనం వల్ల లైన్‌లో ఉన్న ఇతర భక్తుల దర్శనానికి అంతరాయం కలుగదా… క్యూల్లోనే పిల్లలు, మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. యాత్రికులు, ముఖ్యంగా చిన్నారులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల దర్శనానికి ఆటంకం కలిగించేలా ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీబీని కోర్టు ఆదేశించింది. సోమవారంలోగా నివేదిక సమర్పించాలని, సన్నిధానం ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని సమీక్ష కోసం సమర్పించాలని అధికారుల్ని ఆదేశించింది.
దిలీప్ సందర్శన కారనంగా శబరిమల వద్ద యాత్రికుల రాకపోకలకు అంతరాయం కలిగిందని స్పెషల్ కమిషనర్ నివేదిక తర్వాత కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రద్దీగా ఉండే మండల మకరవిళక్కు పండగ సీజన్‌లో ప్రముఖులకు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగినట్లయితే కోర్టు ధిక్కార చర్యలు ప్రాంరభమవుతాయని కోర్టు హెచ్చరించింది. హోదాతో సంబంధం లేకుండా భక్తులందరినీ సమానంగా చూడాలని అందరికి ఒకే ప్రక్రియ ద్వారా వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా దర్శనం కల్పించాలని చెప్పింది. కోర్టు విమర్శలపై టీడీబీ ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ స్పందిస్తూ, దీనిపై విజిలెన్స్ ఎస్పీ విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. దిలీప్ విషయంలో ఎవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామని అన్నారు.