సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ ఖ్యాతి గడించింది. భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగం ఎదుగుతున్న నగరాల్లో ఇది ఒకటి. ఇప్పటికే ప్రపంచ నగరాల్లో ఆల్ఫా సిటీల్లో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా బెంగళూర్ లోని కెంపెగౌడ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు ప్రతిష్టాత్మక అవార్డు పొందింది.
2022 స్కైట్రాక్ వరల్డ్ ఎయిర్ పోెర్ట్ అవార్డ్స్ లో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దక్షిణాసియాలోనే అత్యుత్తమ రిజినల్ ఎయిర్ పోర్టుగా అవార్డ్ గెలుచుకుంది. గ్లోబల్ స్టడీలో ప్రతీ సంవత్సరం అత్యుత్తమ కస్టమర్ సర్వీస్ అందించే ఎయిర్ పోర్టులకు ప్రయాణికులు ఓటు వేస్తుంటారు. అయితే తాజాగా దక్షిణాసియాలోనే అత్యుత్తమ ఎయిర్ పోర్టుగా బెంగళూర్ ఎయిర్ పోర్ట్ ఎంపిక అయింది. చెక్ ఇన్ నుంచి రాకపోకలు, షాపింగ్, భద్రత, ఇమ్మిగ్రేషన్, విమానాశ్రయంలో వినియోగదారుడి అనుభవాలను, ఇతర కీలక వ్యవస్థల పనితీరును సర్వే అంచనా వేస్తుంది.
జూన్ 16న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్ పోలో ఈ అవార్డుల వేడుక జరిగింది. ఏవియేషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఇది ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్ట్స్ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ మేనేజ్మెంట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే విధంగా ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్ తో పాటు దక్షిణాసియాలో అత్యుత్తమ ఎయిర్ పోర్టుల్లో వరసగా నాలుగో సారి మొదటిస్థానంలో నిలిచింది. ప్రపంచంలో టాప్ 50 ఎయిర్ పోర్టుల్లో ఇండియా నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టు మాత్రమే స్థానం సంపాదించింది.